- బీజేపీకి తెర వెనుక సపోర్ట్ చేస్తోందనే ఆరోపణలు
- అందుకే క్యాడర్ లేని సుధీర్ కుమార్‌ను ఎంపిక చేశారనే చర్చ
- రాజయ్యకు టికెట్ ఇవ్వక పోవడానికి కారణం అదేనా?
- వరంగల్‌లో ఆసక్తికర రాజకీయాలు
హనుమకొండ, వెలుగు : వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కడియం శ్రీహరిని దెబ్బకొట్టేందుకు బీఆర్ఎస్ తెరవెనుక పాలిటిక్స్ చేస్తోందా? ఇందులో భాగంగా పెద్దగా పేరు లేని అభ్యర్థిని రంగంలోకి దింపి బీజేపీకి మేలు చేసేలా వ్యూహం రచించిందా అంటే అన్ని పార్టీల క్యాడర్ నుంచి అవును అనే సమాధానమే వస్తోంది. పార్టీ నుంచి కడియం శ్రీహరి బయటకు వెళ్లిన తర్వాత పార్లమెంట్నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయాడు. తమ పార్టీ నుంచి కడియం కూతురుకు టికెట్ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో గులాబీ అధినాయకత్వం శ్రీహరిపై గుర్రుగా ఉంది. అంతకుముందే అరూరి రమేశ్పార్టీ వీడినా లైట్తీసుకున్న ఆ పార్టీ లీడర్లు ఎందుకో కడియం విషయంలో మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. ఎలాగైనా కావ్యను ఓడగొట్టాలన్న లక్ష్యంతో తెరవెనుక బీజేపీకి సపోర్ట్చేసేలా వ్యూహాలు రచిస్తున్నారనే చర్చ సాగుతోంది.
కడియమే టార్గెట్..స్పష్టం చేసిన హరీశ్
వరంగల్ పార్లమెంట్‌నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్కాగా మొదట బీఆర్ఎస్టికెట్ను వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ఆశించారు. కానీ, ఫీల్డ్లెవెల్లో బీఆర్ఎస్కు పరిస్థితులు అనుకూలంగా లేవని గ్రహించి బీజేపీలో చేరారు. కేసీఆర్వరంగల్లో కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు టికెట్ఇవ్వగా ..వారు మాత్రం ఆ పార్టీకి రిజైన్‌చేసి కాంగ్రెస్‌లో చేరి టికెట్తెచ్చుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు అప్పటినుంచి శ్రీహరి, కావ్యను టార్గెట్‌చేసి విమర్శిస్తున్నారు.
కడియం రాజీనామా తర్వాత చింతగట్టులో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కడియం పార్టీ నుంచి వెళ్లిన తర్వాతే పార్టీలో జోష్ కనిపిస్తోందని, పార్టీకి ద్రోహం చేసిన కడియంను ఓడగొట్టాలనే కసి కనపడుతోందన్నారు. టికెట్ఇచ్చిన తర్వాత కూడా ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీపై విమర్శలు చేసిన హరీశ్ రావు.. ఇక్కడి క్యాండిడేట్అరూరి రమేశ్‌పై పెద్దగా మాట్లాడలేదు.
ప్రచారంలో బీఆర్ఎస్డీలా
బీజేపీ అభ్యర్థిగా అరూరి రమేశ్, కాంగ్రెస్క్యాండిడేట్గా కావ్యను ఆ పార్టీ అధిష్ఠానాలు ప్రకటించడంతో ఆ ఇద్దరూ రోజువారీ సమావేశాలతో క్యాడర్‌కు దగ్గరవుతున్నారు. కానీ, బీఆర్ఎస్మాత్రం కడియం బయటకు వెళ్లిన తర్వాత15 రోజులదాకా అభ్యర్థిని ప్రకటించలేదు. గత శుక్రవారం తర్వాత తమ ఎంపీ అభ్యర్థిగా, హనుమకొండ జడ్పీ చైర్మన్డాక్టర్మారపెల్లి సుధీర్ కుమార్‌ను ప్రకటించారు. సరైన క్యాడర్ లేని సుధీర్‌కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించారని ఫీల్డ్లెవెల్లో ఆ పార్టీ లీడర్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు ఆ పార్టీ ప్రచారం కూడా మొదలు పెట్టలేదు. ఇదంతా బీజేపీకి మేలు చేసేందుకేననే ప్రచారం జరుగుతోంది.
సుధీర్..ప్రభావం చూపే స్థితిలో లేరని..
వరంగల్ పార్లమెంట్‌లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కడియంతో కలిపి అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అది తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్భావిస్తుండగా..కడియంను ఓడగొట్టేందుకు బీఆర్ఎస్ అధినేత అవకాశమున్నంత వరకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్లీడర్లు అంతర్గతంగా అరూరికి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్లో ఉన్నన్ని రోజులు ఆరూరి రమేశ్‌కు మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, ధర్మారెడ్డి, వెంకటరమణారెడ్డి, నరేందర్‌తో సత్సంబంధాలే ఉన్నాయి. కానీ, పదవుల విషయంలో వాళ్లంతా కడియంపై గుర్రుగానే ఉన్నారు. దీంతో ఇప్పుడు కడియంను ఓడగొట్టేందుకు బీఆర్ఎస్ నేతలంతా ప్రయత్నిస్తున్నారనే టాక్ నడుస్తోంది. సుధీర్‌కుమార్ ప్రభావం చూపే స్థితిలో లేకపోవడంతో ఆరూరికి ఇంటర్నల్‌గా మద్దతు తెలిపే అవకాశం ఉందంటున్నారు.
రాజయ్యను బరిలో లేకుండా చేసింది అందుకేనా?
బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్, బీఆర్ఎస్అభ్యర్థి సుధీర్కుమార్ఇద్దరూ మాదిగ సామాజికవర్గానికి చెందిన వారే. బీఆర్ఎస్నుంచి అదే సామాజికవర్గానికి చెందిన బలమైన నేత రాజయ్య పోటీ చేస్తే ఓట్లు చీలి కాంగ్రెస్తద్వారా కడియం లాభపడతారనే భావనతోనే రాజయ్యను పోటీలో లేకుండా చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీకి ఫేవర్చేసే వ్యూహంలో భాగంగానే సరైన క్యాడర్ లేని సుధీర్‌కుమార్ ను రంగంలోకి దించారని అంటున్నారు. రాజయ్యకు, కడియంకు మధ్య ఎప్పటినుంచో వైరం ఉండగా.. కడియంపై పగ తీర్చుకునేందుకే పార్టీ నుంచి బయటకు వెళ్లిన రాజయ్యను బీఆర్ఎస్మళ్లీ దగ్గరకు తీసినట్లు తెలుస్తోంది.
కేసీఆర్కాళ్లు మొక్కినా పార్టీ వీడిన వాళ్లను మళ్లీ చేర్చుకోమన్న కేటీఆర్.. కడియంను దెబ్బకొట్టే వ్యూహంలో భాగంగానే రాజయ్యను మళ్లీ దగ్గరకు తీశారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఖరారు కావడంతో ఓరుగల్లు రాజకీయం వేడెక్కగా.. కడియంను దెబ్బకొట్టేందుకు బీఆర్ఎస్ అమలు చేస్తున్న వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.