- అనుచరులను తమవైపు తిప్పుకునే ప్లాన్
- పదవులు ఆఫర్ చేస్తున్నారంటూ ప్రచారం
- తుమ్మలకు కలిసి వచ్చిన రాజకీయ పరిణామాలు
- మళ్లీ యాక్టివ్ గా మారిన మాజీ మంత్రి
- శ్రీనివాస్‌రెడ్డిని ఏకాకిని చేసేందుకు బీఆర్ఎస్ నేతల ప్రయత్నాలు
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తూ, వేరే పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను బీఆర్ఎస్ నేతలు వాడుకుంటున్నారు. డైరెక్ట్ గా పొంగులేటిని టచ్ చేయకుండా ఆయన పక్కనున్న వాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్య అనుచరులుగా ఉన్న వారిని పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా వివిధ రకాల ఆఫర్లను ప్రయోగిస్తున్నారు. డైరెక్ట్ గా మంత్రులు, ఎంపీ స్థాయి లీడర్లు రంగంలోకి దిగి సంప్రదింపులు చేస్తున్నారు. పార్టీలోనే ఉంటే మంచి భవిష్యత్ ఉంటుందంటూ ఆశచూపిస్తున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడంతో పాటు సానుకూలంగా ఉంటే కేసీఆర్‌తో స్వయంగా మాట్లాడిస్తామని చెబుతున్నట్టు సమాచారం. అయితే ఇన్నేళ్లుగా ప్రయారిటీ ఇవ్వకుండా, ఇప్పుడు పొంగులేటిని ఒంటరిని చేసేందుకు ఇలాంటి ఆఫర్లు వస్తుండడంపై ఆచితూచి స్పందిస్తున్నట్టు సమాచారం. కొందరేమో తాము పొంగులేటి వెంటే ఉంటామని, ఏదైనా ఆయనతోనే మాట్లాడాలని చెబుతున్నట్లు తెలుస్తోంది.
పొంగులేటి సైలెంట్.. తుమ్మల యాక్టివ్!
కొత్త సంవత్సరం ప్రారంభం రోజున భారీ ఎత్తున కేడర్ ను సమీకరించి ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనాలతో రాష్ట్రవ్యాప్తంగా పొంగులేటి, తుమ్మల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తర్వాత రెండు వారాల్లో ఇప్పుడు పొంగులేటి సైలెంట్ కాగా, తుమ్మల పార్టీలో యాక్టివ్ గా మారారు. రెండు వారాల్లో ఒకట్రెండు సార్లు పార్టీ లీడర్ల కామెంట్లకు పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. రీసెంట్ గా రెండు మూడు రోజుల నుంచి మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అదే సమయంలో ఇన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉన్న తుమ్మల ఇప్పుడు యాక్టివ్ ఆయ్యారు. ఇటీవల మంత్రి కేటీఆర్ మామ పెద్ద కర్మ సందర్భంగా హైదరాబాద్ లో పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసిన తుమ్మల, ఆ తర్వాత సీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూర్లో సందడి చేశారు. కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభం, పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ సమయాల్లో కేసీఆర్ వెంటే తుమ్మల ఉన్నారు. ఇక బహిరంగ సభ ఏర్పాట్ల కోసం జిల్లాకు వచ్చిన హరీశ్‌రావు కూడా అదే రోజు రాత్రి తుమ్మల ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. తాజాగా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశానికి తుమ్మల హాజరయ్యారు. ఈ మీటింగ్ కు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో పొంగులేటి ఫోటోలు కనిపించకపోగా, తుమ్మలకు వెల్ కమ్ చెబుతూ నిలువెత్తు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అంతకు ముందు ఇన్ డైరెక్ట్ గా తుమ్మల నాగేశ్వరరావుపై కామెంట్లు చేసిన సండ్ర కూడా హరీశ్‌తో కలిసి తుమ్మల ఇంటికి వెళ్లారు. ఇక సత్తుపల్లి మీటింగ్ లో హరీశ్‌తో పాటు ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు తుమ్మలను ఆకాశానికెత్తారు. శనివారం నుంచి పార్టీ బహిరంగసభ ఏర్పాట్లకు తుమ్మల దిశానిర్దేశం చేయాలని హరీశ్‌రావు కోరారు. పొంగులేటి పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు తుమ్మలకు ఇప్పుడు రాజకీయంగా కలిసి వచ్చాయన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
మళ్లీ టచ్‌లోకి..
కొన్నేళ్లుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంట భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, మార్క్‌ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, బేబీ స్వర్ణకుమారి, డాక్టర్ కోట రాంబాబు, బొమ్మెర రామ్మూర్తి తదితరులు ఉన్నారు. వీరిలో ఇప్పటికే చాలా మందిని బీఆర్ఎస్ ముఖ్య నేతలు కలిసినట్టు చెబుతున్నారు. ఈనెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ సభకు ఇన్‌చార్జీగా పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరు పొందిన రాష్ట్ర మంత్రి హరీశ్‌రావుకు కేసీఆర్ బాధ్యతలు ఇవ్వడం వెనుక అంతరార్థం ఇదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీని లైన్లో పెట్టడంతో పాటు, సభ సక్సెస్ చేయడమే మెయిన్ అజెండాగా హరీశ్ఎంట్రీ ఉందన్న విశ్లేషణలున్నాయి. పొంగులేటి శిబిరంలో ఉన్న లీడర్లతో టచ్ ఉన్న నేతలు మాట్లాడి తమ శిబిరంలోకి మారేలా చూస్తున్నట్లు చెబుతున్నారు. ఒకరిద్దరు ఇప్పటికే పార్టీలో కొనసాగేందుకు ఓకే చెప్పినట్లు బీఆర్ఎస్ నేతలు లీకులిస్తున్నారు. వారికి సీఎం టూర్ సందర్భంగా ప్రాముఖ్యత ఉంటుందంటూ చెప్పుకొస్తున్నారు.