పాలకుర్తిపై కేసీఆర్​ వరాలు .. తొర్రూరులో బీఆర్​ఎస్​ ఆశీర్వాద సభ

  • 15 నిమిషాల్లో  ముగిసిన కేసీఆర్​ ఉపన్యాసం
  • యువకులకు 23వేల డ్రైవింగ్​లైసెన్స్​లు ఇచ్చామన్న ఎర్రబెల్లి
  • మళ్లీ బీఆర్​ఎస్​ను గెలిపించాలని విజ్ఞప్తి

తొర్రూరు, వెలుగు :  ​ మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో మంగళవారం  రాష్ట్ర పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ అధ్యక్షతన  బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్​ వచ్చారు. సభలో ఆయన 15 నిమిషాలపాటు మాట్లాడారు. తాను మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాలకుర్తికి ఇంజినీరింగ్​ కాలేజీ మంజూరు చేస్తానన్నారు.  

ప్రతి గ్రామానికి వంద ఇండ్లు మొదటి ఏడాదిలోనే ఇస్తానన్నారు.    కొత్తగా రెండు మండలాల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.   దళిత బంధులాగా  ఉద్యోగం, భూమిలేని గిరిజనులకు గిరిజన బంధిస్తామన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎస్సారెస్పీ కాల్వ ద్వారా 1.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. నిత్యం ప్రజల కష్టసుఖాల్లో  పాలుపంచుకొనే మంత్రి దయాకర్​రావును అశీర్వదించి మరో సారి గెలిపిస్తే పాలకుర్తి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారన్నారు. 

కేసీఆర్​ను హ్యాట్రిక్​ సీఎం చేయాలి : 

 సీఎం కేసీఆర్​తోనే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తుందని, కేసీఆర్​ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు కోరారు.  సీఎం కేసీఆర్​ చొరవతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో  అభివృద్ధి  చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీ  ఏర్పాటుతో పాటు  పాలకుర్తి ఆర్డీవో డివిజన్ చేయాలని, రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు.  అలాగే  చిందు, యక్ష గాన కళాకారులకు పెన్షన్ ఇవ్వాలన్నారు. సంచార జాతుల కోసం రూ.5 కోట్లతో బిల్డింగ్​ కడుతున్నట్లు తెలిపారు.

వారికి త్వరలోనే ఐడి కార్డులు ఇస్తామన్నారు.  ప్రతిగ్రామానికి సీసీ రోడ్లు వేయించానని, చెక్ డ్యాం లు కట్టించి నీటి కొరత లేకుండా   చేసినట్లు తెలిపారు. మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇప్పించి మిషన్లు  ఇచ్చామని,  యువకులకు 23 వేల డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చామన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడు గంటలు కరెంటు ఇస్తుందని,  దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. కర్నాటక రాష్ట్రంలో రైతు వ్యతిరేక విధానాలు మన రాష్ట్రంలో అవలంభించాలని చూస్తున్నారన్నారు. తాను 6సార్లు ఎమ్మెల్యే, 1సారి ఎంపీగా గెలిచి ప్రజా సేవ చేశానన్నారు.

 ఆశీర్వదిస్తే..  గెలిప్తే ప్రజల రుణం తీర్చుకుంటాన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ సమక్షంలో పలువురు బీఆర్ఎస్​ పార్టీలో చేరారు. ఈ సమావేశంలో కే.కేశవ ​రావు, ఎంపీదయాకర్​, ఆరోగ్యశ్రీ ట్రస్ట్​ చైర్మన్​ సుధాకర్​రావు, ఎమ్మెల్యే శంకర్​ నాయక్​, ఆనందభాస్కర్​, జడ్పిచైర్​పర్సన్​ బిందు, ఎంపీపీ అంజయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్​, మున్సిపల్​ చైర్మన్​ రామచంద్రయ్య,  కిషోర్ రెడ్డి, డాక్టర్​ సోమేశ్వర్​ రావు, ఎల్​వీఎన్​ గౌడ్​, సీతారాములు, బిందు శ్రీను, దేవేందర్​రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.