ఖమ్మం గులాబీమయం

  • జిల్లాపై వరాల జల్లు  ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్​ తిప్పలు

ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో  బుధవారం జరిగిన బీఆర్ఎస్​ ఆవిర్భావ సభతో ప్రధాన రోడ్లన్నీ గులాబీమయంగా మారాయి. ఉమ్మడి జిల్లాతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి 5 లక్షల మంది కార్యకర్తలు, జనాలను సమీకరించాలని లీడర్లు టార్గెట్ పెట్టుకున్నా, ఆ మేరకు జనం హాజరు కాలేదు. ఉదయం 11 గంటల నుంచి సభా ప్రాంగణానికి జనాల రాక ప్రారంభమైంది. మధ్యాహ్నం 1.30కి నలుగురు సీఎంలు, జాతీయ నేతలతో కూడిన రెండు హెలికాప్టర్లు కలెక్టరేట్  కాంప్లెక్స్ కు చేరుకున్నాయి. అక్కడ మంత్రులు హరీశ్​రావు, పువ్వాడ అజయ్ వారికి స్వాగతం పలికారు. మొదట ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ను ప్రారంభించి కలెక్టర్ ను ఆయన ఛాంబర్ లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి.వెంకటాయపాలెంకు చెందిన ఆరుగురికి డాక్టర్లు పరీక్షలు నిర్వహించగా, వారికి అవసరమైన కళ్లద్దాలను సీఎంలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కాంప్లెక్స్, కంటివెలుగు కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల సీఎంలు మెచ్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో ఈ రెండు విధానాలను తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామని ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు ప్రకటించారు. 

సభావేదికపైకి మంత్రులు, ఎమ్మెల్యేలు.. 

సభావేదికపై జాతీయ స్థాయి లీడర్లతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు మాత్రమే ఉంటారని, మంత్రులు సహా మిగిలిన వారంతా స్టేజీ కిందనే ఉంటారని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. కాగా, కేబినెట్ మంత్రులు, బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ జాతీయ నేత పువ్వాడ నాగేశ్వరరావు వేదికపైనే కూర్చున్నారు. సీఎంలు సభకు రాకముందే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. సాయంత్రం  త్రివేండ్రం వెళ్లాల్సినఉండడంతో  కేరళ సీఎం విజయన్ ముందుగానే మాట్లాడివెళ్లిపోయారు. తర్వాత యూపీ మాజీ సీఎం అఖిలేష్ హిందీలో మాట్లాడారు. విజయన్, అఖిలేశ్​ మాట్లాడుతున్న సమయంలో కొంత మంది యువకులు గోల చేయడంతో  కేసీఆర్ కొంచెం సీరియస్ అయ్యారు. హిందీ, ఇంగ్లిష్ స్పీచ్​లను వినడం నేర్చుకోవాలని మందలించారు. ఆ తర్వాత సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా తెలుగులో ప్రారంభించి ఇంగ్లిష్​లో మాట్లాడారు. తర్వాత మాట్లాడిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ ప్రసంగం చిన్న కవితలతో, చమత్కరాలతో ఆసక్తికరంగా సాగింది. తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హిందీలో మాట్లాడారు. చివరికి  సీఎం కేసీఆర్ ప్రసంగించారు. 

ట్రాఫిక్​ తిప్పలు..

బహిరంగ సభతో ఖమ్మం, వైరా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. సభ ముగిసిన తర్వాత వాహనాలన్నీ ఒకేసారి రోడ్డెక్కడంతో నాలుగైదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. రెండు డ్రోన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ ను పోలీసులు మానిటరింగ్ చేసి, ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ప్రోటోకాల్ సమస్య తలెత్తకుండా ఐదు రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ 6 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఐజీపీ షానవాజ్ ఖాసీం, పోలీస్  కమిషనర్  విష్ణు ఎస్  వారియర్  ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టారు.

వరాల జల్లు..

ఖమ్మం జిల్లాపై సీఎం వరాలు కురిపించారు. గ్రామాలకు, పట్టణాలను, ఖమ్మానికి ప్రత్యేక నిధులను ప్రకటించారు. నెల రోజుల్లోగా ఖమ్మంలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ స్థలముంటే సరే.. లేదంటే స్థలాన్ని సేకరించి మంత్రులు హరీశ్​రావు, పువ్వాడ అజయ్ కలిసి ఈ పని కంప్లీట్ చేస్తారని చెప్పారు. కేసీఆర్ స్పీచ్ సుదీర్ఘంగా సాగుతున్న సమయంలో సాయంత్రం 5.25కి ఎంపీ సంతోష్ ఒక స్లిప్ ఇచ్చి టైమ్ ను రిమైండ్ చేశారు. హెలికాప్టర్​లో వస్తే ఇదే సమస్య, చీకటి అయితే వెళ్లలేమంటూ చెప్పిన కేసీఆర్  ఐదు నిమిషాల్లో స్పీచ్  ముగించారు. వారం రోజులుగా ఖమ్మంలో ఉండి సభ విజయవంతం కోసం కష్టపడ్డారంటూ మంత్రి హరీశ్​రావును కేసీఆర్ మెచ్చుకున్నారు. గెస్ట్​లకు కరీంనగర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఫిలిగ్రీ వీణలను కేసీఆర్ బహూకరించారు.