
- బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్న ప్రజాప్రతినిధులు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న సెగ్మెంట్లలలో సైతం ఇదే పరిస్థితి
మెదక్, వెలుగు: గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీకోసం ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ తగిన గుర్తింపు గౌరవం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అవకాశం, నామినేటెడ్ పోస్టుల్లో ఛాన్స్లభించలేదని అసంతృప్తితో ఉన్న కొందరు నాయకులు అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు.
మరి కొందరు నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్కు గుడ్‌బై చెబుతున్నారు. బీఆర్ఎస్అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గాల్లో సైతం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పార్టీని వీడుతున్నారు. అభివృద్ధి పనులకు ఫండ్స్ శాంక్షన్ కావాలన్నా, పనులు జరగాలన్నా, ఏదైనా ఇబ్బంది కలిగితే సమస్య పరిష్కారం కావాలన్నాఅధికార పార్టీలో ఉంటేనే సాధ్యమవుతుందన్న అభిప్రాయం ప్రజాప్రతినిధులు, నాయకుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించి కొందరు నాయకులు బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారు.
గజ్వేల్ సెగ్మెంట్నుంచే షురూ..
జిల్లాలో పార్టీ ఫిరాయింపులు మాజీ సీఎం కేసీఆర్ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్నియోజకవర్గం నుంచే మొదలయ్యాయి. ముందుగా రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్, మనోహరాబాద్ సర్పంచ్ మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత తూప్రాన్ మున్సిపల్ చైర్మన్బొంది రవీందర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వైస్ చైర్మన్నందాల శ్రీనివాస్ తోపాటు మరో ఏడుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి, మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు.
చేగుంట ఎంపీపీ సైతం..
దుబ్బాక నియోజకవర్గంలో సైతం బీఆర్ఎస్నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు షురూ అయ్యాయి. దుబ్బాక ఎమ్మెల్యేగా బీఆర్ఎస్అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపొందినప్పటికీ బీఆర్ఎస్ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పార్టీ వీడుతున్నారు. మూడు రోజుల కిందట చేగుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, మండల కోఆప్షన్ మెంబర్ మహ్మద్ అలీ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తాజాగా శనివారం చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ బీఆర్ఎస్ కు రాం రాం చెప్పారు. వీరు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నద్ధం అవుతున్నారు.
మెదక్‌లోనూ..
అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ఓడిపోవడంతో ఆ పార్టీకి చెందిన మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు కొందరు బీఆర్ఎస్ ను వీడుతారనే ప్రచారం జరుగుతోంది. గత మున్సిపల్‌ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీచేసి కౌన్సిలర్లుగా గెలిచిన వారు కొన్నాళ్ల తర్వాత బీఆర్ఎస్ లోజాయిన్అయ్యారు. ఇపుడు వారు ఘర్‌వాపసీ అయ్యేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.
వారితోపాటు బీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న మరికొందరు కౌన్సిలర్లు సైతం కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నట్టు సమాచారం. కాగా ఇతర పార్టీల నుంచి వచ్చే వారి విషయంలో కాంగ్రెస్ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇదివరకు కాంగ్రెస్‌లో పనిచేసి ఎన్నికల ముందు బీఆర్ఎస్లోకి వెళ్లిన కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు మళ్లీ కాంగ్రెస్‌లోకి రావాలనుకుంటుండగా.. అవకాశవాద రాజకీయాలు చేసే అలాంటి వారికి నో చెబుతున్నట్టు తెలిసింది.