హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానంపై జోరుగా చర్చ జరుగుతోంది. రెండ్రోజుల క్రితం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఇంట్లో BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో అవిశ్వాస తీర్మానంపై చర్చించారు. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నాలుగేళ్లు పూర్తయిన తర్వాతనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. ఫిబ్రవరి 20కు మేయర్, డిప్యూటీ మేయర్ లు ఎన్నిక జరిగి నాలుగేళ్లు అవుతుంది. మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెడుతామంటూ జనవరి 22న మరోసారి ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నాలుగేళ్లు పూర్తయిన తర్వాతనే మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. ఫిబ్రవరి 10 కి మేయర్, డిప్యూటీ మేయర్ లు ఎన్నికై నాలుగేళ్లు. ప్రస్తుతం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కలిసి మొత్తం 196 మంది ఉన్నారు. అవిశ్వాసం పెట్టాలంటే సగం మంది సభ్యుల మద్దతు ఉండాలి... అవిశ్వాసం నెగ్గాలంటే 2/3 మెంబెర్స్ మద్దతు ఉండాలి. బీఆర్ఎస్ కు జీహెచ్ఎంసీలో 42 మంది కార్పొరేటర్లు, 29 ఎక్స్ అఫీషియో లు కలిపి మొత్తం 71 సంఖ్యా బలం ఉంది. అవిశ్వాసం ప్రవేశపెట్టాలన్నా..బీఆర్ఎస్ కు సంఖ్యా బలం లేదు. అయితే బీజేపీ తమకు సపోర్ట్ చేస్తుందని బీఆర్ఎస్ కార్పొరేటర్లు భావిస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీకి 39 మంది కార్పొరేటర్లు, 6 ఎక్స్ అఫిషియో మెంబెర్స్ కలిపి మొత్తం 45 మంది సంఖ్యా బలం ఉంది. అవిశ్వాసం నెగ్గాలంటే 131 కావాలి.. బీఆర్ఎస్, బీజేపీ కలిసినా 116 మాత్రమే.. ఇంకా 15మంది సభ్యుల మద్దతు కావాలి. 41 కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్ అఫిషియో సభ్యులున్న ఎంఐఎం తమతోనే ఉందనే ధీమాతో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉన్నారు. బీఆర్ఎస్ ,బీజేపీ కలిసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా సంఖ్యా బలం లేక వీగిపోతుందన్న ధీమాతో ఉన్నారు మేయర్.