- జీతాలకు 5 వేల కోట్లయితే అంతకంటే ఎక్కువ బాకీలకే పోతున్నయ్ : డిప్యూటీ సీఎం భట్టి
- పదేండ్ల తర్వాత కట్టేలా కండిషన్స్తో గత సర్కారు భారీగా రుణాలు తెచ్చింది
- ఆ అప్పులు ఇప్పుడు మేం తీరుస్తున్నం
- కేంద్ర పథకాలు వినియోగించు కోవాలంటే కఠిన నిబంధనలు
- దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కామెంట్
హైదరాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పుల కిస్తీలకే తాము ప్రతినెలా భారీగా చెల్లిస్తున్నామని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జీతాలు మొత్తం రూ.5 వేల కోట్లు అయితే.. అప్పులకు కట్టే వడ్డీలు అంతకంటే ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. రాష్ట్రానికి భారంగా మారిన రుణాలను రీ-స్ట్రక్చరింగ్ చేయాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరినట్టు చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి చేసిన విజ్ఞప్తులను మంగళవారం ప్రజాభవన్లో భట్టి విక్రమార్క మీడియాకు వెల్లడించారు. కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రాలకు వచ్చే ఆదాయం వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని విన్నవించినట్టు చెప్పారు.
కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని, దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. రాష్ట్రాలు తమ అవసరాలకు తగ్గట్టుగా కేంద్ర ప్రాయోజిత పథకాలు వినియోగించుకునేలా స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆర్థిక సంఘాన్ని కోరినట్టు చెప్పారు. రాష్ట్రాల అవసరాలను కేంద్రం తప్పక పరిగణనలోకి తీసుకోవాలని, కొన్నాళ్లుగా కేంద్ర విధానాలు మూస ధోరణిలో ఉంటున్నాయని పేర్కొన్నారు. దేశమంతా ఒకే విధంగా ఉండేలా విధానాలు రూపొందిస్తున్నారని, ఒక్కో రాష్ట్రానికి ఒక్కోవిధమైన అవసరాలు ఉంటాయనేది పట్టించుకోవడం లేదని తెలిపారు. అన్ని రాష్ట్రాల అవసరాలపై ఢిల్లీలో కూర్చుని విధానాలు రూపొందిస్తున్నారని అన్నారు.
అప్పుల కిస్తీలకే పైసలన్నీ అయిపోతున్నయ్
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ గత పాలకులు చేసిన విపరీత అప్పులతో ఆర్థికంగా కుదేలైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు పదేండ్ల తర్వాత కట్టేలా కండిషన్స్తో తెచ్చిన అప్పులను కట్టాల్సిన బాధ్యత తమపై పడిందన్నారు. ఆ అప్పులకు కిస్తీలు కట్టేందుకే పైసలన్నీ అయిపోతున్నాయని చెప్పారు. అందుకే రుణాలను కొంత రీస్ట్రక్చరింగ్ చేయాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. ప్రస్తుత విధానం వల్ల తలసరి ఆదాయం బాగున్న రాష్ట్రాలకు తక్కువ నిధులు వస్తున్నాయని చెప్పారు.
తెలంగాణ తలసరి ఆదాయం బాగున్నందున భారీగా నిధులు కోల్పోవాల్సి వస్తున్నదని తెలిపారు. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో భిన్న పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, చాలా తక్కువ మంది చేతిలో ఎక్కువ సంపద కేంద్రీకృతమై ఉన్నదని తెలిపారు. ఒకటి రెండు జిల్లాల్లో ప్రజల ఆదాయం, తలసరి ఆదాయం మెరుగ్గా ఉందని, కొన్ని జిల్లాల్లో ప్రజలకు ఉపాధి, ఆదాయం చాలా తక్కువగా ఉందని వివరించారు.
16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తులు
అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి 16వ ఆర్థిక సంఘానికి పలు విజ్ఞప్తులు చేశారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదర్శ కమిటీలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచాయని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆదర్శ కమిటీ లో భాగస్వాములను చేశామని వివరించారు. గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రతి ఏటా రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు.
అక్షరాస్యతను పెంచేందుకు రూ.5 వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం హెల్త్ ప్రొఫైల్ ను రూపొందిస్తున్నట్టు తెలిపారు. హెల్త్ కార్డులు డిజిటలైజేషన్ చేపడుతున్నట్టు చెప్పారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, సంక్షేమ పథకాలకు ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్నామని తెలిపారు.