
కంది, కొండాపూర్, వెలుగు : మాయమాటలు చెప్పే నాయకులకు ఓటు వేసి మోసపోవద్దని బీఆర్ఎస్సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్ ప్రజలను కోరారు. గురువారం మండలం కేంద్రంతో పాటు చిమ్నాపూర్, చిమ్నాపూర్ తండా, తుంకిల తండా, గొల్లగూడెం తండా, చెరియాల్, మామిడిపల్లి, కౌలంపేట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు చింతా ప్రభాకర్‌కు డప్పు చప్పుళ్లతో, డీజే సౌండ్లతో, డ్యాన్సులు, ఆట పాటలతో, గజమాలలు వేసి, పటాకులు కాలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు.
ప్రతి ఊర్లో మహిళలు ఆయనకు మంగళహారతులు ఇస్తూ మా ఓటు మీకే అంటూ ధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించానన్నారు. అందుబాటులో ఉండే తనకు ఓటేసి మరింత సేవ చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే ప్రజల సంక్షేమం కోసమని, రైతు బీమా, రైతు బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ, హరితహారం కార్యక్రమాలతో ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఉన్నారన్నారు.
24 గంటల కరెంటుతో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్గెలిస్తే మళ్లీ కరెంట్ కష్టాలు మొదలవుతాయని, గత పరిస్థితులు దాపురిస్తాయన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఉన్నారు.
భర్తను గెలిపించాలని భార్య ప్రచారం
కొండాపూర్ : బీఆర్ఎస్సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్ కు ఓటేయాలని ఆయన భార్య అరుణ ప్రచారం నిర్వహించారు. అనంతసాగర్, సైదాపూర్ తండాల్లో మహిళలతో కలిసి ప్రచారం చేశారు. ఆరోగ్యం బాగా లేకున్నా ప్రజల కోసం హర్నిశలు కష్టపడుతున్న తన భర్త చింతా ప్రభాకర్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ మండల ఇన్‌చార్జి తిరుపతి, సర్పంచులు అంకుశ, జడ్పీటీసీ పద్మావతి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ALSO READ: రామాయంపేట ఎంతో అభివృద్ధి చేశాం : పద్మా దేవేందర్‌రెడ్డి