కాంగ్రెస్​లోకి బీఆర్ఎస్ సర్పంచులు

ఎల్లారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట, గాంధారి, నాగిరెడ్డిపేట, తాడ్వాయి మండలాల్లోని అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు సర్పంచులు, 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్​లోకి చేరారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మదన్ ​మోహన్​ రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజా, మాజీ ఎమ్మెల్యేలు జాజుల సురేందర్, ఏనుగు రవీందర్  హయాంలో​ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిలో అట్టడుగుకు చేరిందన్నారు. 

ALSO READ : కాంగ్రెస్ రిజర్వేషన్ల వల్లే కొప్పుల మంత్రి అయ్యిండు : మల్లు రవి

ఎమ్మెల్యే జాజుల సురేందర్  తన సొంత అభివృద్ధి తప్ప, నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయించని దయనీయ స్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని, అందుకే సర్పంచులు వారిపై నమ్మకం కోల్పోతున్నారన్నారు. కాంగ్రెస్  పార్టీలో చేరిన వారిలో గాంధారి మండలం సర్వపూర్ సర్పంచ్  రాజేందర్, నేరల్  సర్పంచ్  సాయిలు, తిప్పారం సర్పంచ్  సాయిలు, లింగంపేట మండలం ఒంటర్ పల్లి సర్పంచ్  రాజన్న, ఎల్లారం సర్పంచ్  మల్లయ్య ఉన్నారు.