- దళితబంధు, గృహలక్ష్మి, బీసీ బంధు స్కీంల కింద లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్
- బీఆర్ఎస్ కార్యకర్తలకూ ఇచ్చారనే ఆరోపణలు
- ‘డబుల్ ఇండ్ల’ కోసం లబ్ధిదారుల పడిగాపులు
- గ్రౌండింగ్ కాక ఇబ్బందులు రివ్యూలు చేస్తున్న మంత్రులు
నల్గొండ, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ సర్కార్హడావిడిగా ఇచ్చిన సంక్షేమ పథకాల ప్రొసీడింగ్స్గ్రౌండింగ్అవుతాయా? లేదా? అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాజీ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేయడంతో అధికారులు అడ్డగోలుగా సాంక్షన్ ఆర్డర్లు ఇచ్చారు. తీరా కోడ్ రావడంతో వాటిని గ్రౌండింగ్ చేయకుండా పక్కన పెట్టారు. లబ్ధిదారుల్లో చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారని ఆరోపణలు, విమర్శలు రావడం, పథకాలు రాని వారు ఆందోళనలు చేయడంతో పలు జిల్లాల్లో గ్రౌండింగ్ ప్రక్రియ మధ్యలోనే ఆపేశారు.
గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపట్టకుండా ఎమ్మెల్యేలే లబ్ధిదారుల పేర్లను ప్రతిపాదించారు. దీంతో చాలాచోట్ల ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్ఎమ్మెల్యేలపై జనాలు తిరగబడ్డారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి వంటి పథకాలు ఎన్నికల్లో కలిసొస్తాయని బీఆర్ఎస్ భావించగా అవే వారి ఓటమికి కారణమయ్యాయి. ప్రస్తుతం ఓడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా జిల్లాల్లో ప్రొసీడింగ్స్ఇచ్చిన లబ్ధిదారులను వెంటబెట్టుకుని కలెక్టర్లను కలిసేందుకు యత్నిస్తున్నారు. కానీ, కలెక్టర్ల నుంచి హామీ లభించడం లేదని తెలుస్తోంది.
ఈ క్రమంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ మంత్రులు జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖల పనితీరుపై, పెండింగ్‌లో ఉన్న పథకాల గురించి రివ్యూ చేస్తున్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ, వ్యవసాయం, సంక్షేమ పథకాలు, 24 గంటల ఉచిత విద్యుత్, మున్సిపాలిటీల్లో అభివృద్ధి గురించి సమీక్షిస్తున్నారు. దీంతో ఎన్నికలకు ముందు ప్రొసీడింగ్స్ఇచ్చిన సంక్షేమ పథకాలపైన మంత్రులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని లబ్ధిదారులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఆగమేఘాల మీద ప్రొసీడింగ్స్
కోడ్ రావడానికి రెండు నెలల ముందు ప్రభుత్వం రెండో విడత దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి యూనిట్లు సాంక్షన్ చేసింది. కోడ్అమల్లోకి వస్తే గ్రౌండింగ్ చేయడం సాధ్యం కాదని చెప్పి అప్పటి ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు అధికారులు ఆగమేఘాల మీద సాంక్షన్ఆర్డర్స్ఇచ్చారు. వాటిల్లో కొన్ని యూనిట్లు మాత్రమే గ్రౌడింగ్ చేయగలిగారు. చాలా జిల్లాల్లో లబ్ధిదారుల పేర్ల మీద ప్రొసీడింగ్స్ ఇచ్చారు. కానీ, కోడ్ రావడంతో పక్కన పెట్టారు. దళితబంధు కింద ప్రతి నియోజకర్గానికి 1100 యూనిట్లు మంజూరయ్యాయి.
అదే విధంగా గృహలక్ష్మి స్కీం కింద ఒక్కో నియోజకవర్గానికి 3వేల చొప్పున సాంక్షన్చేశారు. బీసీ బంధు ఈ ఏడాది జూలై నుంచే మొదలవగా ఫస్ట్ ఫేజ్‌లో 300, ఎన్నికల టైంలో సెకండ్ ఫేజ్ కింద 200 ఇచ్చారు. యూనిట్ విలువ రూ.లక్ష. కావడంతో ఎమ్మెల్యేలు ఎవరి పేరు చెబితే వాళ్లకు చెక్కులిచ్చారు. కానీ, లబ్ధిదారులు యూనిట్లు పెట్టుకున్నారా..లేదా..అన్నది చూడలేదు. జిల్లాల్లో కోడ్ రావడంతో ప్రొసీడింగ్స్ ఇచ్చి పెండింగ్‌లో పెట్టారు.
ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తహసీల్దార్ల సమక్షంలో లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో సెలెక్ట్ చేసి ఇండ్లు ఇవ్వకుండా ఆపేశారు. ఆయా జిల్లాలో ఒకటి, రెండు నియోజకవర్గాల్లో మినహా ఎక్కడా డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల గ్రౌండింగ్ పూర్తి కాలేదు.
నల్గొండ జిల్లాలో ఇలా..
నల్గొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో దళితబంధు కింద 1100 యూనిట్లు మంజూరు కాగా, కేవలం నల్గొండ నియోజకవర్గంలో మాత్రమే 1055 మందికి సాంక్షన్ చేశారు. కోడ్ రావడంతో గ్రౌండింగ్ చేయలేదు. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని శాలిగౌరారం మండలంలో బ్యాంకు అకౌంట్లు తీసుకున్నారు. కలెక్టర్అకౌంట్లోకి డబ్బులు కూడా వచ్చాయి. కానీ, కోడ్ రావడంతో ఆపేశారు. గృహలక్ష్మి కింద ఆరు సెగ్మెంట్లకు కలిపి18వేల యూనిట్లు సాంక్షన్అయ్యాయి. 16,800 దరఖాస్తులు రాగా, 12 వేల అప్లికేషన్లను ఆన్లైన్లో ఆమోదించారు. ఫిజికల్వెరిఫికేషన్ మాత్రమే మిగిలి ఉంది.
నల్గొండ నియోజకవర్గంలో మాత్రమే బేస్మెంట్పనులు మొదలుపెట్టగా, పైసలు రిలీజ్ చేయలేదు. బీసీ బంధు కింద మొదటి, రెండో విడతల్లో కలిపి 3 వేల యూనిట్లు సాంక్షన్అయ్యాయి. దీంట్లో 2,350 మందికి రూ.లక్ష చొప్పున చెక్కులు ఇచ్చారు. కానీ, యూనిట్లు పెట్టుకున్నారా ? లేదా? అన్నది విచారించలేదు. ఇక్కడ మరో 650 యూనిట్లు పెండింగ్‌లో ఉన్నాయి. డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల విషయానికి వస్తే దేవరకొండలో మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నాగార్జునసాగర్, మునుగోడు నియోజకవర్గాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.
నల్గొండ, మిర్యాలగూడలో ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసినా, గ్రౌండింగ్ చేయలేదు. నకిరేకల్నియోజకవర్గంలో నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లిలో మాత్రమే గ్రౌండింగ్‌చేశారు. మిగతావి పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి1400 చొప్పున ఇండ్లు సాంక్షన్ చేసి నిర్మించినా మౌలిక వసతుల పనులు మాత్రం పెండింగ్‌లోనే ఉన్నాయి.
దళితబంధు యూనిట్లు గ్రౌండింగ్ చేయాలి
నల్గొండ అర్బన్ : నల్గొండ నియోజకవర్గ పరిధిలో దళిత బంధు కింద మంజూరైన 1055 యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని దళితబంధు సాధన కమిటీ నాయకులు పాలడుగు నాగార్జున, బకరం శ్రీనివాస్, అద్దంకి రవి డిమాండ్ చేశారు. సోమవారం నల్గొండ కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌కు వినతి పత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ.. గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రొసీడింగ్స్ ఇచ్చారని తెలిపారు.
కోడ్ వచ్చినందున గ్రౌండింగ్ ప్రక్రియ ఆగిపోయిందని, తమకు మంజూరైన యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని కోరారు. దళిత బంధు సాధన కమిటీ నాయకులు కత్తుల జగన్ కుమార్, కందుల లక్ష్మయ్య, బొజ్జ వెంకన్న, బడుపుల శంకర్, చింత సైదులు, తలారి పరమేశ్, ఆరెకంటి నరసింహ, కందుల రమేశ్, ఏపూరి జానయ్య పాల్గొన్నారు.
పైసలియ్యలే..పని ఆపేసినం
గృహలక్ష్మి స్కీం కింద ఇల్లు కట్టుకునేందుకు మున్సిపల్ అధికారులు అనుమతి ఇచ్చారు. స్థలాన్ని పరిశీలించి ఫొటోలు కూడా తీసుకున్నరు. బేస్మెంట్కడితే పైసలు ఇస్తమని చెప్పిన్రు. దీంతో ఇంటి పనులు కూడా మొదలుపెట్టినం. పైసల కోసం అధికారులను అడిగితే ఏం చెప్పలేదు. దీంతో పని మధ్యలోనే ఆపేశాం.
- వంగూరి శ్రీలత, నల్గొండ