బీఆర్ఎస్​ రజతోత్సవ వేడుక.. అస్తిత్వం ఆగమయ్యాక.. అట్టహాసం ఎందుకు ?

 బీఆర్ఎస్​ రజతోత్సవ వేడుక.. అస్తిత్వం ఆగమయ్యాక.. అట్టహాసం ఎందుకు ?

ఏప్రిల్ 27న వరంగల్– కరీంనగర్ సరిహద్దుల్లోని ఎల్కతుర్తి పరిసర ప్రాంతాల్లో రూ. వంద కోట్లకు పైగా ఖర్చుతో అట్టహాసంగా నిర్వహించబోయే బీఆర్​ఎస్​ రజతోత్సవ వేడుక టీఆర్ఎస్​ పుట్టుకను  ప్రశ్నిస్తున్నది. ఆ మాటకొస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునూ అవమానిస్తోంది. బీఆర్ఎస్ పేరిట జరపబోతున్న రజతోత్సవ సంబురం ఎవరి కోసం, ఎందుకోసమన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.  తెలంగాణవాదులు, ముఖ్యంగా ఉద్యమకారులు ఆ సభా వేదిక నుంచి ఏం సందేశం వస్తుందని ఆసక్తిగా గమనిస్తున్నారు.  టీఆర్ఎస్ పుట్టిందెప్పుడు?  రంగు మారకపోయినా రుచి, వాసన మార్చి అదే పార్టీని బీఆర్ఎస్​గా మార్చిందెప్పుడు? మరి అదే మూడేళ్ల పార్టీకి అప్పడే 25 ఏండ్లు ఎట్ల నిండినయి? ఎట్లా రజతోత్సవాలు నిర్వహిస్తారనే  తెలంగాణవాదుల  సాంకేతిక ప్రశ్నలకు దాటవేతే సమాధానం వస్తున్నది.

ఏ రాజకీయ పార్టీ అయినా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం పరిపాటి.  అందునా 25 ఏండ్ల సంబురాలు జరుపుకోవడమూ తప్పేం కాదు. అయితే అధికారం కోల్పోయిన అనంతరం ఎన్నికల్లో వరుస ఓటములు, కారణాలపై విశ్లేషణ జరపకుండా, అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన పార్లమెంట్​లో తెలంగాణ సమూహం దెబ్బకు పార్టీ డిపాజిట్లు కోల్పోయిన దుస్థితి.  దాని ఫలితంగా ఏ ఎన్నికల్లోనూ పోటీచేసే సాహసం చేయని పరిస్థితి.  కేవలం కాంగ్రెస్​ ను  
తిట్టడానికో,   రేవంత్ పాలనను విమర్శించడానికో,  లేక 25ఏండ్ల  పార్టీ ఉద్యమ గుర్తులను  నెమరువేసుకునేందుకో గాని  కేసీఆర్ పెడుతున్న సభపై  ఆ పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహమైతే ఉంది. అయితే,  అదే కారు గుర్తు, అదే గులాబీ జెండా అదే నాయకత్వం బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పేరిట నైతికంగా, సాంకేతికంగా ఎలా ఈ ఉత్సవాలు చేస్తుందన్నది మౌలిక ప్రశ్న. 

తప్పిదాలపై కొరవడిన సమీక్ష

టీఆర్ఎస్ 2001లో స్థాపించినప్పటికీ, బీఆర్ఎస్  పేరిట పార్టీమారి కేవలం మూడేండ్లు మాత్రమే. పార్టీ పుట్టుకే  తెలంగాణ అస్తిత్వం,  పార్టీ  నేపథ్యమే స్థానికం. పదేండ్లు అధికారాన్ని కూడా తెలంగాణ సమాజం కట్టబెట్టింది.  అయితే, ఏ లక్ష్యాల కోసం తెలంగాణ తెచ్చుకున్నమో.. దీర్ఘకాలికంగా తెలంగాణ పునర్నిర్మాణం ఏ మేరకు జరిగిందో  లేదో అవలోకనం చేసుకుని రజతోత్సవాల సందర్భంగా ఆత్మపరిశీలన చేసుకుంటే అద్బుత ఫలితాలొస్తాయి.  తెలంగాణ రాష్ట్రం సాధించుకునేంతవరకు  కేసీఆర్  నాయకత్వం అనివార్యమైంది. రాష్ట్ర ఆవిర్భావానంతరం రాజకీయ అవకాశాలు పార్టీని చిందరవందరకు గురిచేశాయి. అయినా  కేసీఆర్ ను  ప్రజలు మరోసారి విశ్వసించి రెండోసారి అధికారాన్ని కట్టబెట్టారు.  కానీ, ఈసారి బీఆర్ఎస్ ఉద్యమ  లక్షణాలను విడిచిపెట్టి ఫక్తు రాజకీయ పార్టీ చేసే పనులకంటే  ఎక్కువే చేసింది.  ఫలితంగా ఉద్యమకారులు దూరమయ్యారు. తప్పిదాలపై సమీక్ష కొరవడడం, మితిమీరిన అధికార దర్పంతో ఒంటెద్దు నిర్ణయాల వల్లే పార్టీ ఇవాళ అధికారం కోల్పోయిందన్నది నిర్వివాదాంశం. 

బీఆర్ఎస్​తోనే పతనం ఆరంభం

రజతోత్సవాలను నిర్వహించే అర్హతను కలిగి ఉందని పార్టీ చెబుతున్నప్పటికీ  పేరు మార్పు వివాదం, ఇటీవలి ఎన్నికల ఓటములు ఈ వేడుకల ఔచిత్యంపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. తెలంగాణ పేరుతో ఏర్పడ్డ పార్టీ రూపాంతరం చెంది భారత రాష్ట్ర సమితిగా మారిననాటి నుంచే  కేసీఆర్ పార్టీకి,  తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెగిపోయిందని  విమర్శలూ ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ప్రచారం చేసింది. తెలంగాణకు అసలైన పేగు బంధం మాదేనని, తెలంగాణ కోసం సర్వం త్యాగం చేశామని స్వయంగా సోనియాగాంధీ చెప్పడంతో 2023లో తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని ఆదరించింది. అస్తిత్వానికి ఎసరు పెట్టిన ‘బీఆర్​ఎస్​’ పేరుబీఆర్ఎస్ బ్యానర్​పై ప్రతి ఎన్నికలో ఓటమి పాలవుతూ వస్తున్నది. బీఆర్ఎస్​కు తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని దూరం చేసిన అధికారం నిరూపించింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో చరిత్రలో లేనివిధంగా సున్నా సీట్లు రావడంతో పాటు మెజార్టీ సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన ఐదు శాసనమండలి ఎన్నికల్లోనూ పోటీచేసే సాహసం చేయలేదు. ఈ పరిణామ క్రమంలో బీఆర్ఎస్​ను ప్రజలు ఆదరించడంలేదని క్షేత్ర ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.  పశ్చిమ బెంగాల్​లో మమతా, ఏపీలో చంద్రబాబుగాని తమ రాష్ట్ర మూలాలెప్పుడు మరువలేదు. కానీ, కేసీఆర్ తన పుట్టుక, అస్తిత్వ మూలాలను గాలికొదిలేయడంతో ఆయన, పార్టీ రెంటికీ చెడ్డ రేవడయ్యాయి. 

బీఆర్ఎస్  మైండ్ గేమ్! 

నిజాలకు నిలకడ తక్కువ.. అబద్ధాలకు అలజడెక్కువనట్టు కాంగ్రెస్ పార్టీ తాను చేసుకున్నది చెప్పేలోపే బీఆర్ఎస్  సోషల్ మీడియాతో  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభాసుపాలుచేసే ప్రయత్నం చేస్తోంది. మధ్యలో ఎమ్మెల్సీ కవిత కాలికి బలపం కట్టుకుని అప్పుడే ప్రభుత్వ వైఫల్యాలపై తెగ ప్రచారం చేస్తున్నారు. నిజానికి 16 నెలల్లోనే మహిళకు ఫ్రీ బస్సు, రైతు రుణమాఫీ, సన్నాలకు రూ.500 బోనస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, గేమ్ ఛేంజర్​గా పిలుస్తున్న సన్నబియ్యం తదితరాలతో పాటు తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవ  చిరునామాలైన అధికారిక తెలంగాణ తల్లి విగ్రహం. గేయం, లోగోల మార్పువంటితో ప్రజాప్రభుత్వం కీలక నిర్ణయాలు అమలులో ఉన్నా .. బీఆర్ఎస్ సోషల్ మీడియా ముందు బలాదూరయ్యాయి. 

హైడ్రా, మూసీ ప్రక్షాళన, కంచ గచ్చిబౌలి భూములపై ముందు చూపులేని కారణంగా కాంగ్రెస్ పై బీఆర్ఎస్ విజయవంతంగా దాడి చేయగలిగింది.  బీసీ కుల గణన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైలేజీ. ఏండ్ల నాటి ఎస్సీ వర్గీకరణ కూడా రేవంత్ సర్కారు హయాంలోనే చరిత్రకెక్కినా ఈ రెండింటి అంశాల్లో బీసీ , ఎస్సీ వర్గాల్లో కాంగ్రెస్ అనుకున్నంత స్థానం సంపాందించుకున్నా.. రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, ఈ క్షణంలోనే ఎన్నికలొచ్చేస్తున్నాయన్న ఓ రకమైన భావనను కేటీఆర్ లాంటి వాళ్లు  క్రియేట్ చేస్తున్నారు. 36 మంది ఎమ్మెల్యేలకు కండువాలు కప్పి, మంత్రి పదవులు కట్టబెట్టినప్పుడు రాని ఫిరాయింపులు, ఉప ఎన్నికలు ఇప్పుడెట్ల వస్తాయో చెప్పడం లేదు. అంతేకాదు తెలంగాణలో కేసీఆర్​ను ఓడించి ప్రజలే తప్పు చేశారని, బీఆర్ఎస్, కేసీఆర్ తెలంగాణకు ఓ చారిత్రక అవసరమని అందమైన అబద్ధాలతో మైండ్ గేమ్ ఆడుతున్నా.. కాంగ్రెస్ సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోతున్నది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఓ అనిశ్చితి ఏర్పడే పరిస్థితి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. 


కేసీఆర్ ఏం మాట్లాడతరు?

కాంగ్రెస్  ప్రభుత్వం  కూలిపోతుందని, వ్యతిరేకత  పెరుగుతోందని నిన్నటిదాకా నేతలకు సర్ది చెప్పిన కేసీఆర్ సభపై తొందరపడుతున్నారన్న భావన నెలకొంటున్నది.  సభలో  ఎవరిని ఉద్దేశించి ప్రసంగిస్తారనే ఆసక్తికర చర్చ లేకపోలేదు. 

 16 నెలల కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడ

తారా? 2001నాటి  గుర్తులను నెమరేస్తారా? వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పార్టీని సంస్థాగతంగా మరమ్మతులు చేస్తారా? ఇదే సందర్భంలో పదేండ్ల పాలనా వైఫల్యాలపై కాంగ్రెస్ మాట్లాడితే వాటికేం సమాధానం చెబుతారు?  ఫోన్ ట్యాపింగ్,  కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్, గొర్రెల స్కీంలోని స్కాంలు, ఫార్ములా ఈ రేసుతో సహా శాఖలవారీగా కాంగ్రెస్ తవ్వి తీసిన అక్రమాలపై  కేసీఆర్ తన సహజ శైలిలో స్పందిస్తారా?  రేవంత్ అనే పేరు పలకడం ఇష్టం లేని ఆయన విధి లేక ఆయన పేరెత్తి ప్రసంగిస్తారా?  ఫాం హౌస్​ నుంచే రూట్ మ్యాప్ గీసి పార్టీని నడిపిస్తున్న ఆయన ఇకపై అసెంబ్లీకొస్తానని, ప్రజల మధ్యే ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తానని చెప్పగలరా? 

నిందించేందుకే సభ పరిమితమా?

ఈ  వేడుక  క్యాడర్‌‌‌‌ను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఒక వ్యూహంగా ఉపకరిస్తుందా?  పార్టీ ఓడినప్పటినుంచి ప్రజలకు దూరంగా ఉన్న  కేసీఆర్ ఏడాది తర్వాత బయటకొస్తున్నారు. కాబట్టి, పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం ఉంటుంది కానీ, ఆయన నైజం తెలిసిన తెలంగాణ బుద్ధిజీవులు దీన్నో సాదాసీదా రాజకీయ సభలా, అధికార పార్టీని నిందించే వేదికలా చూస్తున్నారు.

ఏ ప్రస్థానం కోసం వరంగల్ సభ?

భారీ బహిరంగ సభల నిర్వహణకు పెట్టింది పేరు కేసీఆర్. అధికారంలో ఉన్నప్పుడు ఒక కొంగర్ కలాన్ మినహా అంతకుముందు నిర్వహించిన కరీంనగర్ సింహగర్జన,  సిద్దిపేట,  హైదరాబాద్, వరంగల్​లో నిర్విహంచిన భారీ సభలు ఇప్పటికీ రికార్డే. అయితే, మళ్లీ వరంగల్​లో సభ పెట్టి ఉనికిని చాటుకుంటే తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని భావించిన కేసీఆర్ ఎల్కతుర్తి సభా వేదికను నిర్ణయించారు. మీటింగ్​పై స్థానిక నాయకత్వంతోనే  రోజువారీ ఆన్ లైన్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. మండుటెండల్లో సభ సక్సెస్​పై  గతంలో ఏ సభకు వెచ్చించని విధంగా ఈసారి రూ. వంద కోట్లకు పైగా ఖర్చుతో నిర్వహిస్తున్నారు.  నేతలకు టార్గెట్ పెట్టి జన సమీకరణపై దృష్టి పెడుతున్నారు. గతంలో  కేసీఆర్ ఎప్పుడూ జన సమీకరణకు ఇంతగా ధనం వెదజల్లలేదు. కేసీఆర్ పదేండ్లు పాలించి తనకు తానే తెలంగాణ ప్రజలకు దూరమైన వేళ జరుగుతున్న సభ ఇది.  అలాంటి  కేసీఆర్ సభకు తెలంగాణ సమాజానికి సంబంధం ఏముంటుంది?  కేవలం 
ఆ పార్టీ శ్రేణులను బలవంతంగా కదిలించడం తప్ప మరో మార్గం లేదు. 

- వెంకట్ గుంటిపల్లి,
తెలంగాణ 
జర్నలిస్టుల ఫోరం