
చలో వరంగల్’ తెలంగాణ ఉద్యమ చరిత్రలో మళ్లీ మెరుపులెక్కించే మైలురాయి సభ. ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న ‘చలో వరంగల్ .. 25 ఏళ్ల బీఆర్ఎస్ స్థాపన వేడుక’ సభ తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక అద్భుత మలుపు తిప్పే ఘట్టంగా నిలవనుంది. ఇది కేవలం ఒక జయహో సభ కాదు.. ఇది తెలంగాణ ప్రజల నిబద్ధతకు, కేసీఆర్ నాయకత్వానికి, ఉద్యమ త్యాగాలకు, అభివృద్ధి విజయాలకు నిదర్శనంగా నిలిచే చారిత్రాత్మక కార్యక్రమం.
ఒక ఉద్యమం ఎలా ఒక రాష్ట్రాన్ని అందించిందో గుర్తు చేసే సభ.. పదేండ్ల కేసీఆర్ పాలన ఎలా ఉంది? ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? ప్రజలే బేరీజు వేసుకుంటున్న కీలక సందర్భం ఇది. మళ్లీ కేసీఆర్ పాలనే రావాలని ప్రజలు కోరుకుంటున్న సందర్భం. పదిలక్షల ప్రజలతో జరిగే రేపటి రజతోత్సవ సభనే అందుకు గీటురాయి కాబోతున్నది.
2001లో జలదృశ్యంలో స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (తదనంతరం బీఆర్‌ఎస్‌గా మారింది), అప్పట్లో ఒక్కటే లక్ష్యం పెట్టుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అప్పటి పౌరులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఒక ఆశాకిరణంగా నిలిచారు.
2004లో పార్లమెంటులో ‘తెలంగాణ మాట’ను మొదటిసారి విపక్షంగా లేవనెత్తిన నాయకుడు కేసీఆర్ మాత్రమే. ఆయన మాటల్లో ‘జిల్లాల మధ్య అసమానతలు, నదులపై హక్కు లేకపోవడం, నీటికి నిరాకరణ, ఉద్యోగాల విభజనలో అన్యాయం, భాషా ధ్వంసం ఇవన్నీ నా ప్రజలకు జరిగిన ద్రోహం. దీన్ని తట్టుకోలేకనే ఉద్యమాన్ని చేపట్టాను’ అని చెప్పారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే తెగింపు ఉద్యమం చేపట్టిన కేసీఆర్ చివరకు విజయతీరాన్ని ముద్దాడేదాకా వదలలేదు.
14 ఏండ్ల పోరాట ఫలితం
2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఇది కేవలం రాజకీయం కాదు. లక్షలాది మంది విద్యార్థుల త్యాగం, ఉద్యోగుల ఉపవాసం, రైతుల నిరీక్షణ, మహిళల ఆశల ఫలితం. దీన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. ఆయన రాజకీయ పోరాటంలో అనేకసార్లు ఉప ఎన్నికలు తెచ్చి తెలంగాణ ఏర్పాటుకు ప్రజాభిప్రాయాన్ని ఢిల్లీకి చాటిచెప్పాడు. ‘వేయిదశల వ్యూహం’ కేసీఆర్‌ను తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది. సకల జనుల సభలతో తెలంగాణ గొంతును విశ్వవ్యాప్తం చేయగలిగారు. దేశంలోని అనేక రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టి కేంద్రంపై రాజకీయ ఒత్తిడిని తేగలిగారు.
గతంలో సోనియాగాంధీ చేత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీని బహిరంగసభలో ఇప్పించింది కేసీఆరే. ఉద్యమ లక్ష్యం చివరకు 2014లో ఫలించింది. అసాధ్యమైన తెలంగాణను సాధించి సుసాధ్యం చేసిన ఘనత నీదే అని ఆనాటి రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ కేసీఆర్‌ను ప్రశంసించడం గమనార్హం. 12 వందల అమరుల కలను నిజం చేసి కేసీఆర్ దేశ చరిత్రలోనే వినుతికెక్కారు.
తెలంగాణ పునరుజ్జీవం
2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ పాలన తెలంగాణను అన్ని రంగాల్లో పునరుజ్జీవింపజేసింది. ఎడారిలా మారిన తెలంగాణ వ్యవసాయాన్ని కేసీఆర్ సస్యశ్యామలం చేయగలిగారు. పాలకుడిలో సాహసం ఉండాలి. అలాంటి నేత దేన్నైనా సాధించగలడని పదేండ్లలో కేసీఆర్ నిరూపించుకున్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేసిన చరిత్ర ఆయనది. ప్రతి గ్రామానికి యోగ్యమైన మంచినీటి పథకాన్ని (మిషన్ భగీరథ) అమలు చేసి దేశాన్నే ఆశ్చర్యపరిచారు. అందుకు అన్ని రాష్ట్రాలకూ తెలంగాణ ఆదర్శంగా మారింది. కాళేశ్వరం, పాలమూరు, వాగులు, వంకలు ఎక్కడున్నా అక్కడ చెక్ డ్యామ్‌లతో తెలంగాణను దేశంలోనే అద్భుతమైన వాటర్ హబ్‌గా మార్చారు.
దేశంలో తాగు, సాగు నీటికి కొరతలేని ఏకైక రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణ వచ్చిన నాడు కరెంటు కోతలు. 6 నెలల్లోనే కోతలులేని రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌ది. సుమారు 1.50 కోట్ల టన్నుల ధాన్యాగారంగా మార్చిన చరిత్ర పదేండ్ల కేసీఆర్ పాలనది. రైతు బంధు, రైతుబీమా ఇచ్చిన కేసీఆర్ పాలనను చూసి దేశమే నివ్వెరపోయింది. రైతు కష్టాలను తొలగించిన రైతు బాంధవుడని ప్రతి రైతూ ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నాడు. రేవంత్ పాలనను తిట్టిపోసుకుంటుండటమే అందుకు సాక్ష్యం. సంక్షేమం అభివృద్ధిని జోడెడ్లుగా నడిపిన పదేండ్ల పాలన తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది.
తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెంచిన ఘనత కేసీఆర్‌దే
హైదరాబాద్‌ను అద్భుత నగరంగా మార్చిన ఘనత ఆనాటి మంత్రి కేటీఆర్‌దే అని నగరంలో ఎవరినడిగినా చెపుతారు. తెలంగాణ వచ్చిన నాడు తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు 2023 నాటికి అది రూ3.17 లక్షలయిందంటే, పదేండ్లలో ఏం జరిగితే అది సాధ్యమైందో అందరికీ అర్థమవుతుంది. తెలంగాణ వచ్చిన నాడు తెలంగాణ జీఎస్డీపీ రూ. 5 లక్షల కోట్లు. 2023లో అది 13 లక్షలకు చేరుకుంది. 2014లో ఐటీ ఎగుమతులు కేవలంరూ.57వేలకోట్లు. 2023లో రూ.2.41 లక్షల కోట్లు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు అమలు ఓ అద్భుత రికార్డు. దీన్ని దేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రమూ ఇవ్వలేకపోతున్నది.
ప్రజలను పీడిస్తున్న పాలన
2023లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, హామీల అమలులో విఫలమైంది. 6 గ్యారెంటీలు – గాలికొదులయ్యాయా? గృహలక్ష్మి చెక్కులు ఇంకా చేతులకు చేరలేదు. యువజన గ్యారంటీ – ఉద్యోగ భద్రత గల్లంతు. రేవంత్ పరిపాలనలో నియంతృత్వ ధోరణి, హైదరాబాదు యూనివర్సిటీ అడవిని కట్ చేయడం, విద్యార్థులపై కేసులు పెట్టడం, మీడియా విమర్శలపై ప్రతీకారం తీర్చుకోవడం. మూసీ ప్రాజెక్ట్ ముసుగులో నిర్వాసితులపై దాడులు, భూములపై గుర్తింపులుంటే కూడా ‘ఆర్బీఎక్స్’గా గుర్తించి గృహాలపై ఎర్ర రంగుతో బెదిరింపులు. ఇది రాజ్యాంగ విరుద్ధం.
లగచర్ల, మూసీ, హైడ్రా వంటి కార్యాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. రైతు రుణమాఫీ పూర్తిగా జరిపిన పాపాన పోలేదు. రైతు భరోసాకు దిక్కులేదు. తెలంగాణ గ్రామాలు వెలవెలబోతున్నాయి. కేసీఆర్ పాలనే బాగుండే అనే నారెటివ్ ప్రతిగ్రామంలో వినిపిస్తున్నది. ఇది చాలదా రేవంత్ సర్కార్ ఏంచేసిందో, ఎం చేస్తున్నదో చెప్పడానికి?2023లో బీఆర్ఎస్ను ఓడించి ఏమి సాధించుకున్నాం అనే చర్చ అంతటా కనిపిస్తున్నది. తెలంగాణ తిరిగి కేసీఆరే రావాలని కోరుకుంటున్నదని ప్రజల పల్స్ చెపుతున్నాయి. ఎల్కతుర్తిలో లక్షలాది ప్రజలతో జరగనున్న రజతోత్సవ సభనే అందుకు సాక్ష్యంగా నిలవబోతున్నది.
బహిరంగ సభలే
కేసీఆర్ అనేక గర్జన సభలతోనే తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన బహిరంగ సభలే తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించాయి. కేసీఆర్‌కు ప్రజలతో కనెక్టివిటీని పెంచినవి ఆ నాటి గర్జన సభలే. ఇవాళ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన తెలంగాణ ప్రజల ఆశలన్నిటీని భగ్నం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను రేవంత్ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. ఇంతకీ తెలంగాణను పాలిస్తున్నది రేవంత్రెడ్డియా, చంద్రబాబా అర్థంకాని పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఫలితంగా తెలంగాణ మరో ఉద్యమానికి ఉపక్రమించాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఈ విషయం గ్రహించిన కేసీఆర్ తిరిగి ప్రజలతో మమేకం కావడానికే రజతోత్సవ సభతో ఉద్యమ శంఖం ఊదబోతున్నారు. పదేండ్ల పాలనా విజయాలను ప్రజలకు గుర్తుచేయడం, ఏడాదిన్నరలోనే భగ్నమైన తెలంగాణను తిరిగి పునరుజ్జీవం చేయడమే లక్ష్యంగా సభ జరగనుంది.
భగ్నమైన తెలంగాణను కాపాడటం కోసమే..
బీఆర్ఎస్ రజతోత్సవ సభ రాజకీయం కోసం కాదు. ఏడాదిన్నర కాలంలో భగ్నమైన తెలంగాణను తిరిగి నిలబెట్టడానికే. ఇది భవిష్యత్ తెలంగాణ కోసం బీఆర్ఎస్ ఇచ్చే నూతన పిలుపు. ఇది తిరిగి ఉద్యమ తెలంగాణ ను మేల్కొల్పే వేదిక. ఒక ముఖ్యమంత్రి పాలన ఎలా ఉండాలో గుర్తు చేసే ఘట్టం. ఆనాటి ఉద్యమ గౌరవాన్ని గుర్తు చేసుకొని. వంచించిన రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం, ప్రజలు తమ హక్కుల కోసం పోరాడటానికి కేసీఆర్ నాయకత్వంలో భగ్నమైన తెలంగాణను కాపాడుకోవడమే లక్ష్యంగా రజతోత్సవ సభ జరగబోతున్నది. వరంగల్ సభ, తెలంగాణ ప్రజలకు పునర్జన్మ చూపించే ఆత్మీయమైన పిలుపునిస్తున్నది. ఇది మరో ఉద్యమానికి మౌలికం. ఇది ప్రజలు ‘మన భవిష్యత్తు – మన చేతుల్లోనే’ అనే విషయాన్ని గుర్తు చేసుకునే మహాసభ. ఉద్యమానికి తిరిగి ఊపొచ్చే పునాదిగా ఈ సభ చరిత్రలో నిలిచిపోనున్నది.
- దాసోజు శ్రవణ్,ఎమ్మెల్సీ, బీఆర్ఎస్