కాంగ్రెస్ నేతల్లో వణుకు పుట్టింది : హరీశ్ రావు

కాంగ్రెస్ నేతల్లో వణుకు పుట్టింది : హరీశ్ రావు
  • రజతోత్సవ సభ చూసి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తినయ్: హరీశ్ రావు

హనుమకొండ, వెలుగు: బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనగానే కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని, కేసీఆర్ నిలదీస్తాడని ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రజతోత్సవ సభను విజయవంతం చేశారంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం హరీశ్​రావు ఓ ప్రకటన విడుదల చేశారు. రజతోత్సవ సభకు అడ్డంకులు సృష్టించేందుకు అడుగడుగునా పోలీసుల ఆంక్షలు, నిర్భంధాలు ప్రయోగించిన దుర్మార్గపు సర్కారు అని మండిపడ్డారు.

 సభా స్థలానికి కార్యకర్తలు చేరకుండా 10 నుంచి 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చేశారని ఆరోపించారు. ఎక్కడికక్కడ  అడ్డుకుని, పోలీసులే దగ్గరుండి వాహనాలను తిప్పి పంపారని అన్నారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాకు చెందిన వెయ్యికిపైగా వాహనాలను హుస్నాబాద్ – కొత్తపల్లి నుంచి యూటర్న్ చేసి సిద్దిపేట వైపు మళ్లించారని చెప్పారు. సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్ర ఫెయిల్ అయ్యిందని అన్నారు. అయినా కాంగ్రెస్ కుట్రలను తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పటాపంచలు చేశారని తెలిపారు.