నియోజకవర్గ ప్రజలే నాకు దేవుళ్లు: కోనేరు కోనప్ప 

కాగజ్ నగర్, వెలుగు: మూడుసార్లు తనను ఆదరించి గెలిపించిన నియోజకవర్గం ప్రజలే తనకు దేవుళ్లని సిర్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప అన్నారు. మంగళవారం బెజ్జుర్ మండలంలోని ముంజంపల్లి, పోతెపల్లి, కొరెతగూడ, కుకుడ తదితర  గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. ప్రజలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కోనప్ప మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్​ను గెలిపించాలని కోరారు. సాధారణ కుటుంబంలో పుట్టిన తాను నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుస్తున్నానని,  ప్రతి పల్లెతో తనకు ప్రత్యే అనుబంధం ఉందని చెప్పారు.

మారుమూల గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు నిబద్ధతతో పనిచేశానని చెప్పారు. ఎన్నికలు వస్తే నియోజకవర్గ ప్రజలను మోసం చేసేందుకు కొత్త నాయకులు వస్తారని.. వాళ్లకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం కూడా జరుగుతూనే వస్తోందని ఎద్దేవా చేశారు. కొందరు నాయకులు పనిగట్టుకొని కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందేందుకు చూస్తున్నారని, ప్రజలు వాళ్ల మాటలు నమ్మే స్థితిలో లేరన్నారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని, మరింత అభివృద్ధి జరగాలంటే బీఆర్​ఎస్​ను గెలిపించాలని కోరారు.