- బీఆర్ఎస్ మెదక్, నర్సాపూర్ స్థానాలపై ఉత్కంఠ
- ఒక్కో టికెట్టు కోసం ముగ్గురి ప్రయత్నాలు
- అందరి దృష్టి ఫస్ట్ లిస్ట్ పైనే
మెదక్, వెలుగు : నేడు బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అవనున్న నేపథ్యంలో స్థానిక సెగ్మెంట్లలో ఉత్కంఠ మొదలైంది. మెదక్, నర్సాపూర్‌లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆశావాహులు పెరగడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. మొదటి లిస్ట్‌లో తమ పేరు ఉంటుందా? ఉండదా? అన్న ఆందోళనలో ప్రస్తుత ఎమ్మెల్యేలున్నారు.
హ్యట్రిక్కోసం ఆశ..
మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ స్థానాల్లో వరుసగా 2014, 2018 ఎన్నికల్లోనే ఆర్ ఎస్ అభ్యర్థులు పద్మా దేవేందర్ రెడ్డి, చిలుముల మదన్ రెడ్డి ఎమ్మెల్యే లుగా గెలుపొందారు. ఈ సారి ఎన్నికల్లో కూడా పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆశిస్తున్నారు . మరోవైపు వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకే మళ్లీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఈసారి ఆశావాహులు పెరగడంతో ఉత్కంఠ పెరిగింది.
మెదక్‌లో ముగ్గురు..
మెదక్ స్థానంలో తనకు తిరుగు లేదని, సొంత పార్టీ లో, ప్రతిపక్ష పార్టీలో పోటీదారులే లేరని సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మొన్నటి వరకూ భావించారు. అదే జోష్‌లో హ్యాట్రిక్‌పై ఆశలు పెట్టుకున్నారు. కానీ, సీఎం పొలిటికల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి స్థానికంగా ఉంటూ.. ఇదే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాను ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నాననే సంకేతాలు ఇస్తున్నారు.
మరోవైపు అధికార పార్టీకి చెందిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొడుకు రోహిత్ కూడా ఇదే టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించే ఆయన ఎంఎస్ఎస్ఓ పేరుతో సోషల్ సర్వీస్ చేస్తున్నారు. భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. దీంతో మెదక్ టికెట్‌కు త్రిముఖ పోరు కనిపిస్తోంది.
నర్సాపూర్ లో సేమ్ సీన్...
నర్సాపూర్ అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి మళ్లీ టికెట్ తనదే అని భావిస్తున్నారు. కానీ, ఈ టికెట్ విషయంలో మాజీ మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె 2019 పార్లమెంట్ ఎన్నికల కారు పార్టీలో చేరారు. 2023 ఎన్నికల్లో టికెట్ ఇస్తామనే పార్టీ పెద్దల హామీ తోనే సునీతా రెడ్డి బీఆర్ఎస్లో చేరారని, అందువల్ల ఈసారి ఎన్నికల్లో టికెట్ ఆమెకే వస్తుందన్న ప్రచారం జరుగుతోంది.
మరోవైపు బీ సీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని జిల్లా ఎంపీపీ ల ఫోరం అధ్యక్షులు, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ కోరుతున్నారు. ఆయన నియోజక వర్గంలోని మండలాలలో పర్యటిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా మెదక్ సెగ్మెంట్ లో ముగ్గురు, నర్సాపూర్ సెగ్మెంట్ లో ముగ్గురు టికెట్ కోసం పోటీ పడుతుండటంతో ఎవరిని అదృష్టం వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రెండు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో టికెట్ ఎవరికి వస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.