- అక్కడి పార్టీ కార్యకర్తలకు రాజకీయ శిక్షణ
- రాబోయే ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యత వీరిపైనే
- భాష, సంస్కృతి, సంప్రదాయాల పేరిట ఓటర్లకు గాలం
నిర్మల్, వెలుగు : మహారాష్ట్ర బార్డర్ గ్రామాలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సరిహద్దు గ్రామాల్లో ఈసారి ఎలాగైనా మెజార్టీ ఓట్లు సాధించాలన్న లక్ష్యంతో సరికొత్త ఎత్తుగడలు రూపొందించింది. ఇందులో భాగంగానే నిర్మల్, ఆదిలాబాద్, నిజా మాబాద్, కామారెడ్డి తదితర జిల్లాల్లోని సరిహద్దు గ్రామాలను ఆ పార్టీ లక్ష్యంగా చేసుకుంటుంది. మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాలలో తమ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలందరినీ రాబోయే ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగించుకోవాలని భావిస్తున్న హైకమాండ్ దాదాపు 200 మంది సీనియర్ కార్యకర్తలకు తెలంగాణ భవన్ లో శిక్షణ ఇస్తున్నారు.
ఇప్పటికే శిక్షణ పొందిన మహారాష్ట్రకు చెందిన కార్యకర్తలు సరిహద్దు గ్రామాలలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలోని గ్రామాలలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేసింది. వీరి నుంచి రాజకీయాల్లో చురుకుగా పాల్గొనే వారిని ప్రచారకర్తలుగా ఎంపిక చేసుకోనున్నారు. ఎన్నికలు ముగిసే వరకు వీరందరికీ గౌరవ వేతనంతోపాటు భోజనం, వసతి కల్పించనున్నట్లు తెలిసింది.
పథకాలపై ప్రచారం
సరిహద్దు గ్రామాలలో మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇంటింటా ప్రచారం చేయనున్నారు. మహారాష్ట్రలో అమలవుతున్న పథకాల మధ్య తేడా వివరించానున్నారు. సరిహద్దు గ్రామాలలో ఇప్పటికీ మరాఠీ భాష మహారాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల ప్రభావం ఉంటుంది. దీని కారణంగానే ఈ మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జిలు తమకు కేటాయించిన గ్రామాల్లో మరాఠీ భాషలో అక్కడి సంస్కృతి సాంప్రదాయాలను కలగలిపి తెలంగాణ పథకాలను ఓటర్లకు వివరించానున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
త్వరలో బాధ్యతలు
మహారాష్ట్ర గ్రామాల బీఆర్ఎస్ సీనియర్లకు ఇక్కడి గ్రామాల ప్రచార బాధ్యతను అప్పజెప్పబోతున్నారు. వీరి పర్యవేక్షణలోనే ఇక్కడ పార్టీ వ్యవహారాలు సాగనున్నాయి. స్థానిక నేతలంతా మహారాష్ట్ర నుంచి వచ్చే పార్టీ నేతలకు ఎన్నికలు పూర్తయ్యే వరకు సహకరించాలని హైకమాండ్ ఇప్పటికే నియోజకవర్గాల నేతలకు సూచించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.