తెలంగాణ రాష్ట్ర గీతం, రాజముద్రపై బీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం రగడను సృష్టించడం సరైనది కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వెలమ కుల భూస్వామ్య, ధనస్వామ్య, పెత్తందారి పెట్టుబడిదారీ ప్రయోజనాలే ప్రాధాన్యంగా గత ప్రభుత్వ పాలన సాగింది.- రాచరిక ముద్రలను సృష్టించి, వలసవాదుల విధానాలే పరమావధిగా అమలు చేసింది. ఇందులో భాగంగా బతుకమ్మ పాటను తెలంగాణేతర ఏఆర్ రహమాన్ తో పాడించడం జరిగింది.
ప్రగతి భవనంలో ముఖ్యమంత్రి కుర్చీలో చినజీయర్ స్వామిని కూర్చుండబెట్టడం, యాదాద్రి గుడికి కూడా ప్రత్యేకంగా హెలికాప్టర్లో తీసుకెళ్లడం జరిగింది. ఆంధ్రావారు అనే కదా మెగా కృష్ణారెడ్డికి మేజర్ కాంట్రాక్టులను ఇచ్చింది. చండీయాగం చేయించింది ఆంధ్రా బ్రాహ్మణవాళ్ళతోనే కదా. తెలంగాణకు సంబంధం లేని సమంతను చేనేత అంబాసిడర్గా ప్రకటించలేదా. మొత్తంగా ఆంధ్రా పెట్టుబడిదారుల విధానం కొనసాగాలని కేసీఆర్ బలంగా భావించారు.
తెలంగాణ అంటే మట్టి కాదు. బహుజన శ్రామిక కులాల సామాజిక, సాంస్కృతిక, భావజాల పోరాట నేపథ్యం కలిగి ఉన్నది. ఈ విధానానికి స్వస్తి పలికి వెలమ కుల ప్రయోజనాలని,- రాజముద్రలను పునర్ స్థిరీకరణ చేసి ప్రజల మీద 10 ఏండ్లుగా రుద్దారు. ఎన్నికల్లో ప్రజామోదంతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను యూటీ చేసేందుకు కుట్ర చేస్తుందని.. మళ్లీ తెలంగాణ అస్తిత్వం పేరు మీద రెచ్చగొట్టే పనికి పూనుకోవడం దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. కాకతీయులు అనగా వెలమ కులం దొరలు.
సమ్మక్క సారక్క, ఆదివాసీ వన వీరులను హత్యచేసి రాజ్యాన్ని కొనసాగించిన కాకతీయుల చరిత్రను తెలంగాణ ప్రజలపై రుద్దడం అనేది వెలమ కులీకరణే అవుతుంది. కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్వాయి పాపన్న, తెలంగాణ అమరవీరులు, తదితరుల చరిత్ర, సాంస్కృతిక విధానం తెలంగాణ
రాజముద్రపై ఉండాలి.
- పాపని నాగరాజు,
(ISU జాతీయ అధ్యక్షుడు )