
శంకర్పల్లి, వెలుగు: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు లక్ష్మారెడ్డి(55) శంకర్‌పల్లిలో రైలు కింద పడి చనిపోయారు. వికారాబాద్ రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మారెడ్డి గురువారం సాయంత్రం తాడ్‌బండ్ ఆంజనేయస్వామిని దర్శించుకొని తన కారులో రాత్రి 10 గంటల సమయంలో శంకర్పల్లి రైల్వే స్టేషన్‌కి వెళ్లారు. అక్కడ కారును పార్క్ చేసి స్టేషన్‌కి 300 మీటర్ల దూరం నడుచుకొంటూ వెళ్లారు. 11.30 గంటల సమయంలో హైదరాబాద్- ముంబై ఎక్స్ ప్రెస్ ట్రైన్‌కి ఎదురుగా నిల్చున్నారు. ట్రైన్ వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముక్కలు ముక్కలై ఆయన ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు శవాన్ని గుర్తించారు.
ఆత్మహత్యా? హత్యా?
రైల్వే పోలీసులు లక్ష్మారెడ్డి మృతిని ప్రాథమికంగా ఆత్మహత్యగా భావించినప్పటికీ, హత్యా కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మారెడ్డికి ఆర్థికంగా, రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, వేరే ఎవరైనా ఆయనను హత్య చేశారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. వికారాబాద్‌లో పోస్టుమార్టం అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు డెడ్‌బాడీని అప్పగించామని వికారాబాద్ రైల్వే సీఐ వెంకట్రాములు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్లీపూర్‌కు చెందిన లక్ష్మారెడ్డికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నది. ఒక కూతురు విదేశాల్లో స్థిరపడింది. లక్ష్మారెడ్డి గతంలో జహీరాబాద్ మాజీ ఏఎంసీ చైర్మన్, మాజీ ఎంపీపీ, అల్లీపూర్ గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. అలాగే జహీరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.