స్టేషన్‌ఘన్‌పూర్/ధర్మసాగర్, వెలుగు : ‘నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధే నా ఎజెండా’ అని బీఆర్‌ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కడియం శ్రీహరి చెప్పారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైనవారందరికీ గృహలక్ష్మి, దళితబంధు అందజేస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ లీడర్లకు ఎన్నికలు వచ్చినప్పుడే గ్రామాలు గుర్తుకువస్తాయని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని, ఆరు గ్యారంటీల అమలు సాధ్యం కాదన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే డ్రామాలు ఆడుతున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీకి కేడర్ లేదన్నారు.
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణలోని పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పిట్టల శ్రీలత, ఫిషరీస్ డైరెక్టర్ సత్యనారాయణ, మండల అధ్యక్షుడు రాజు, సర్పంచ్‌లు నవ్య, అవనీజ, శోభ పాల్గొన్నారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్‌లోని పార్టీ ఆఫీస్‌ను, మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్న సభా స్థలాన్ని పరిశీలించారు. బూత్ కమిటీ సభ్యుల ఆత్మీయ సమావేశాన్ని సక్సెస్ చేయాలని కోరారు. డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ చల్లా సుధీర్‌రెడ్డి, నాయకులు వెంకన్న, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.