
తిరుమలలో బీఆర్ఎస్ స్టిక్కర్ ఉన్న జీపు కనిపించడం కలకలం సృష్టించింది. బీఆర్ఎస్ నేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీమ్ అంటూ సిక్టర్ తో ఉన్న జీపు తిరుమలకు చేరుకుంది. జీపు తిరుమల నుంచి తిరుపతికి దిగుతున్న సమయంలో భక్తులు వీడియో తీసి దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. అయితే అలిపిరి టోల్ గేట్ దగ్గర తనిఖీలు దాటుకుని జీపు తిరుమలకు రావడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
తిరుమలకు వచ్చే వాహనాలలో రాజకీయ పార్టీల జెండాలు, నాయకుల ఫోటోలు ఉండటం నిషేధం. అలాంటి ఫోటోలుంటే సప్తగిరి టోల్ గేట్ దగ్గరే విజిలెన్స్ సిబ్బంది తొలగిస్తుంది. కానీ సెక్యూరిటీని దాటుకుని జీపు తిరుమలకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అలిపిరి దగ్గర సెక్యూరిటీ నిద్రపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెంటనే దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.