- కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేసినా ఉమ్మడి జిల్లాపై కనిపించని ప్రభావం
- సీఎంతో సహా ఏడుగురు ఓటమి
- సీట్లతో పాటు ఓట్లు తగ్గినయ్
కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై బీఆర్ఎస్ వ్యూహం పారలేదు. కామారెడ్డిలో కేసీఆర్ బరిలో నిలవడం ద్వారా ఉమ్మడి జిల్లాలోని అన్ని సెగ్మెంట్లను గెలిపించుకోవచ్చని ఆ పార్టీ లీడర్లు భావించారు. కానీ ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. గత ఎన్నికల కంటే ఈ సారి సీట్లతో పాటు ఓట్లు కూడా తగ్గాయి. ఉమ్మడి జిల్లాలో 9 స్థానాలకుగాను బీఆర్ఎస్ఈ సారి రెండింటిలోనే విజయం సాధించింది.
కేసీఆర్‌తో పాటు ఆరుగురు ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో 9 స్థానాలకు గాను 8 చోట్ల ఆ పార్టీ గెలుపొందింది. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ గెలిచిన జాజాల సురేందర్ ఆ తర్వాత కొద్దిరోజులకు బీఆర్ఎస్లో చేరారు. గతానికి భిన్నంగా ఈ సారి ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. ఒకే పార్టీకి కాకుండా మూడు పార్టీల వైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్ పార్టీకి 4, బీజేపీకి 3, బీఆర్ఎస్కు 2 స్థానాలు దక్కాయి. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు 2018లో 6,60,650 ఓట్లు రాగా, ఈసారి 5,40,533 ఓట్లు వచ్చాయి. గతంతో పోలిస్తే 1,20,077 ఓట్లు తగ్గాయి.
మిగతా నియోజకవర్గాల్లో..
గత ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ నుంచి గెలిచిన జాజాల సురేందర్ ఈ సారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు 62,988 ఓట్లు వచ్చాయి. జుక్కల్బరిలో నిలిచిన హన్మంత్‌షిండేకు గత ఎన్నికల్లో 77,584 ఓట్లు రాగా, ఈ సారి 63,337 ఓట్లు పడ్డాయి. వెయ్యి పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంత్‌రావు చేతిలో ఓడిపోయారు. బాన్సువాడలో పోచారం విజయం సాధించినా గతంలో కంటే 1,665 ఓట్లు తగ్గాయి.
బోధన్‌లో పోటీ చేసిన షకీల్2018 ఎన్నికల్లో 74,895 ఓట్లు పొందితే, ఈసారి 66,963 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ క్యాండిడేట్ సుదర్శన్‌రెడ్డి చేతిలో ఓటమిని చవిచూశారు. నిజామాబాద్అర్బన్లో గత ఎన్నికల్లో విజయం సాధించిన బిగాల గణేశ్‌గుప్తా, ఈ సారి మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2018లో 71,896 ఓట్లు వస్తే ఈ సారి 44,829 మాత్రమే వచ్చాయి. 27,067 ఓట్లు తగ్గాయి.
నిజామాబాద్ రూరల్‌లో బీఆర్ఎస్తరఫున పోటీకి దిగిన బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి చేతిలో ఓడారు. 2018లో బాజిరెడ్డికి 87,976 ఓట్లు రాగా, ఈ సారి 56,415 వచ్చాయి. 31,831 ఓట్లు తగ్గాయి. ఆర్మూర్లోనూ సిట్టింగ్ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2018లో ఈయనకు ఈయనకు 72,125 ఓట్లు రాగా, ఈ సారి కేవలం 39,395 మాత్రమే వచ్చాయి. 32,730 ఓట్లు తగ్గాయి. బాల్కొండలో వేముల ప్రశాంత్‌రెడ్డి మరోసారి విజయం సాధించినా గతం కంటే 3,245 ఓట్లు తగ్గాయి.
వంద ఓటర్లకు ఒక ఇన్చార్జిని పెట్టినా..
కామారెడ్డిలో కేసీఆర్ భారీ మెజార్టీ సాధించాలని పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించారు. కేటీఆర్ ఇన్చార్జిగా ఉండి కేసీఆర్ తరఫున అన్నీ తానై వ్యవహరించారు. భారీగా మీటింగులు పెట్టి ప్రచారం చేశారు. 100 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని, బూత్‌కు ఒక ఇన్చార్జి, గ్రామానికో ఇన్చార్జిని నియమించారు. గంప గోవర్ధన్, ఎమ్మెల్యే శేరి సుభాష్‌రెడ్డితో పాటు మిగతా నాయకులతో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు.
కేసీఆర్ ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా కేసీఆర్ ఇక్కడ ఓడిపోయారు. 59,911 ఓట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2018లో గంప గోవర్ధన్‌కు 68,167 ఓట్లు వచ్చాయి. కేసీఆర్పోటీ చేసినా గతాని కంటే ఈ సారి 8,526 ఓట్లు తగ్గాయి.