ఓరుగల్లులో వాడుతున్న గులాబి

  • ఇప్పటికే మేయర్‍ సహా మెజార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్‍లోకి..
  • ఇదే దారిలో మున్సిపల్​చైర్‍పర్సన్లు, కౌన్సిలర్లు  
  • పార్టీ మారే ఆలోచనలో వరంగల్‍ జిల్లా అధ్యక్షుడు ఆరూరి  
  • కాంగ్రెస్‍ వైపు చూస్తున్న డీసీసీబీ చైర్మన్‍ మార్నేని రవీందర్‍రావు
  • టికెట్ ​ఇవ్వకపోతే పనిచేయలేమన్న ఉద్యమకారులు 

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లులో బీఆర్ఎస్​ విలవిలలాడుతోంది. దాదాపు 23 ఏండ్ల పాటు తెలంగాణ ఉద్యమం.. అధికారంలో ఉన్న పదేండ్లు కలిపి ఏనాడు ఇంతటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోలేదు. ఇంతకుముందు బీజేపీ, కాంగ్రెస్‍, కమ్యూనిస్టు లీడర్లు గులాబీ పార్టీలో చేరగా, ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. గ్రేటర్ వరంగల్ తో పాటు మున్సిపాలిటీ, మండలాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా లీడర్లు కాంగ్రెస్‍ కండువాలు కప్పుకుంటున్నారు. వెంటనే తేరుకోకపోతే పార్లమెంట్‍ ఎన్నికలనాటికి గులాబీ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  

బీఆర్ఎస్  వాష్​అవుట్ తప్పదా? ​

వరంగల్​కార్పొరేషన్‍ పరిధిలో 66 డివిజన్లుండగా గత కార్పొరేషన్​ఎన్నికల్లో 51 స్థానాలతో బీఆర్ఎస్​మేయర్‍ పీఠాన్ని దక్కించుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల తరువాత సీన్ మారిపోయింది. ఇప్పటికే వరంగల్‍ తూర్పులో ఒకరు, పశ్చిమలో ఏడుగురు బీఆర్ఎస్​కు రాజీనామా చేశారు. ఇందులో హనుమకొండ పార్టీ అధ్యక్షుడు, పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‍ భాస్కర్‍ అన్న కొడుకు దాస్యం అభినవ్‍ భాస్కర్‍ కూడా ఉన్నారు. 

ఇప్పుడు ఏకంగా గ్రేటర్‍ వరంగల్​మేయర్‍ గుండు సుధారాణితో పాటు వరంగల్‍ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో మరో15 మంది కార్పొరేటర్లు, ఏడెనిమిది మంది మాజీ కార్పొరేటర్లు,16 మంది పార్టీ డివిజన్‍ అధ్యక్షులు కాంగ్రెస్‍ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నారు. వీరంతా హైదరాబాద్‍లో రెండు రోజులుగా వరంగల్‍ తూర్పు ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ మురళి దంపతులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగారాజు ఇంటి వద్ద గ్రూప్​ఫొటోలు దిగుతూ కనిపిస్తున్నారు. 

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో సీఎం రేవంత్‍రెడ్డి బిజీగా ఉన్నందున వీరందరిని పార్టీలోకి ఆహ్వానించేందుకు బుధవారం టైం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదయ్యాక వారంలోపే వరంగల్‍ పశ్చిమ నుంచి మరోమారు డబుల్‍ ఫిగర్‍ కార్పొరేటర్లు జంప్‍ అవనున్నట్లు సమాచారం ఉంది. అదే జరిగితే ఓరుగల్లుకు గుండెకాయలాంటి గ్రేటర్ పరిధిలో బీఆర్​ఎస్​వాష్‍ అవుట్​కావడం తప్పదంటున్నారు.  

వరంగల్‍ నుంచి అరూరి..హనుమకొండ మార్నేని 

ఉమ్మడి వరంగల్‍ జిల్లాలోని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‍ఎస్‍ వరంగల్‍ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి చెందిన ఆరూరి రమేశ్‍ ప్రధాన లీడర్. వచ్చే పార్లమెంట్‍ ఎన్నికల్లో కారు పార్టీ అభ్యర్థిగా అతడి పేరే ప్రముఖంగా వినిపించింది. అయితే, బీఆర్​ఎస్​నుంచి పోటీ చేస్తే గెలుస్తామన్న నమ్మకం లేకపోవడంతో బీజేపీలో చేరుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. పార్టీ మారడంపై రమేశ్​ఇంకా డైలమాలోనే ఉన్నారని చెబుతున్నా, నిజంగా కమలం పార్టీలో చేరితే అది బీఆర్​ఎస్​కు పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. 

మరోవైపు డీసీసీబీ చైర్మన్‍గా ఉన్న హనుమకొండ జిల్లా ఐనవోలు మండలానికి చెందిన మార్నేని రవీందర్‍రావు సైతం కాంగ్రెస్‍ పార్టీలో చేరేందుకు సమాయత్తమవుతున్నారు. గతంలో ఆయనతో కలిసి పనిచేసిన టీడీపీ నేతలంతా ప్రస్తుతం కాంగ్రెస్‍లో ఉండడంతో ఆయన అటువైపు అడుగులు వేస్తున్నారు. మార్నేని ఇప్పటికే కాంగ్రెస్‍ పెద్దలను కలిశారు. కిందిస్థాయి లీడర్లను కాంగ్రెస్​లోకి పంపడంలో ఆయన తెరవెనక పాత్ర పోషిస్తున్నాడని అంటున్నారు.  మహబూబాబాద్‍ జిల్లా నుంచి ఓ మాజీ ఎంపీ పేరు కూడా వినిపిస్తోంది.
Also Read: రాష్ట్రంలో అవినీతిపై సర్జికల్ స్ట్రైక్స్ : మోదీ

మున్సిపల్‍ చైర్‍పర్సన్లు కూడా...

వరంగల్​ సిటీలో మేయర్‍, కార్పొరేటర్లు పార్టీ మారినట్లే రూరల్ పరిధిలో మున్సిపల్​చైర్‍పర్సన్లు, కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్​లోకి లైన్‍ కట్టారు. ఇప్పటికే వరంగల్‍ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్​చైర్‍పర్సన్‍ అంగోత్‍ అరుణ, కౌన్సిలర్లు తుమ్మల రవీందర్‍, మంచాల రామకృష్ణ..హనుమకొండ మండలం పరకాల మున్సిపల్​చైర్‍పర్సన్‍ సోదా అనితా రామకృష్ణతో పాటు ఆరుగురు కౌన్సిలర్లు కారు  దిగి కాంగ్రెస్​లో చేరారు. మహబూబాబాద్‍ జిల్లా తొర్రూర్‍ మున్సిపల్​చైర్మన్‍ రామచంద్రయ్య, వైస్‍ చైర్మన్‍ సురేందర్‍రెడ్డి మరో ఇద్దరు కాంగ్రెస్​లో చేరేందుకు సీఎం రేవంత్‍రెడ్డి అపాయిమెంట్‍ కోసం చూస్తున్నారు. మహబూబాబాద్‍ మున్సిపాలిటీలో బీఆర్‍ఎస్‍ చైర్మన్‍ ఫరీద్​పై అవిశ్వాసం పెట్టగా.. నెగ్గింది. దీంతో ఈ స్థానం కారు నుంచి చేజారినట్టయ్యింది.

పార్టీ తీరుపై కేయూ ఉద్యమకారుల గుర్రు

కాకతీయ యూనివర్సిటీ జేఏసీ ఉద్యమకారులు బీఆర్‍ఎస్‍ పెద్దలపై గుర్రుగా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం చదువులు, ఉద్యోగాలు పక్కనపెట్టి కొట్లాడామని, కేసులు పెడితే జైలు జీవితం అనుభవించామని..అయినా పార్టీ తమను పట్టించుకోలేదని రగిలిపోతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థి ఉద్యమకారులతో పోలిస్తే చట్టసభల్లో, పదవుల్లో కేయూకు అన్యాయం జరిగిందని మండిపడుతున్నారు. లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉద్యమకారులకు వరంగల్‍ ఎస్సీ ఎంపీ స్థానం కేటాయించాలని డిమాండ్‍ చేస్తున్నారు. అలా కాదని..ఉద్యమంతో సంబంధం లేనివారు..పార్టీ సభ్యత్వం లేనివారికి అవకాశమిస్తే పనిచేయలేమని స్పష్టం చేస్తున్నారు. అదే జరిగితే అసెంబ్లీ ఫలితాలే రిపీట్‍ అవుతాయంటున్నారు.