సూర్యాపేట, వెలుగు: గత పాలకుల కుంటుపడిన కులవృత్తులకు జీవం పోసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్‌ఎస్ సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సూర్యాపేటలో విశ్వబ్రాహ్మణ, రజక సంఘం ఆత్మీయ సమ్మేళనాలకు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. అనంతరం చివ్వెంల, ఆత్మకూరు మండల కేంద్రాలతో పాటు రామకోటి తండా, జగన్ తండా, ఏపూర్ ఏనుబాములలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు రజకులను, విశ్వ బ్రాహ్మణులను పట్టించుకోలదేని, తెలంగాణ వచ్చాకే లక్ష ఆర్థిక సాయం, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు.
కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి పోచంపాడు పేరుతో వరుసగా 6 సార్లు ఓట్లు వేయించుకొని రైతులను మోసం చేశారని మండిపడ్డారు . 30 ఏళ్లు నియోజకవర్గాన్ని పాలించిన ఆయన కనీసం మంచినీళ్లు ఇవ్వలేదన్నారు. ఆయన హయాంలో రైతుల కళ్లలో కన్నీళ్లు వచ్చాయే తప్పా, బోర్ల నుంచి నీళ్ళు మాత్రం రాలేవని వాపోయారు. ఆడపడుచులు ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తుంటే, వాటిని తన్నుకుంటూ పోయిన చరిత్ర దామోదర్ రెడ్డిదని విరుచుకుపడ్డారు. 24 గంటల కరెంట్, రైతు బీమా, రైతు బంధు, ఇంటింటికీ తాగునీరు, కల్యాణ లక్ష్మి పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
మంత్రికి మద్దతుగా ఐటీ ఉద్యోగుల ర్యాలీ
సూర్యాపేట అభ్యర్థి, మంతి జగదీశ్ రెడ్డికి మద్దతుగా ఐటీ ఉద్యోగులు సోమవారం సూర్యాపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధితో పాటు ఉద్యోగ కల్పిస్తున్న జగదీశ్ రెడ్డికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఆయన గెలిస్తే ఐటీ మరింత విస్తరిస్తుందని, వేల మందికి కొలువులు వస్తాయని వాళ్లు చెప్పారు.