సిట్టింగులకు అసమ్మతి సెగలు..మూడు నియోజకవర్గాల్లో ఇదే సీన్

  • దివాకర్​ రావుకు టికెట్​పై పెరుగుతున్న నిరసన
  • కాంగ్రెస్​లో చేరిన దండేపల్లి జడ్పీటీసీ, సర్పంచులు
  • ఉమ్మడి అభ్యర్థిని నిలుపుతామంటున్న బీసీ లీడర్లు
  • పార్టీ మారే ప్లాన్​లో  బెల్లంపల్లి, చెన్నూర్​ నాయకులు 
  • చిన్నయ్య బాగోతం బయటపెడతా అంటున్న శేజల్

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లాలో ముగ్గురు సిట్టింగ్​ ఎమ్మెల్యేలకు బీఆర్​ఎస్​ టికెట్లు​ కన్​ఫర్మ్​ కావడంతో ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు నాయకులు నిరసన గళం వినిపిస్తున్నారు. మొన్నటివరకు అభ్యర్థుల మార్పు ఉంటుందని ఎదురుచూసిన వారు ఇక పార్టీలో ఉండలేమంటూ వేరే దారులు వెతుక్కుంటున్నారు.

ఈ లిస్టులో పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులతో పాటు మున్సిపల్​ప్రతినిధులు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎట్టకేలకు టికెట్​ రెన్యువల్​ అయినందుకు ఓవైపు ఆనందిస్తూనే మరోవైపు అసమ్మతి గ్రూపులపై ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోనూ ఈ పరిస్థితి నెలకొంది. 

కాంగ్రెస్​లోకి ఎంపీపీ, సర్పంచులు

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావుపై నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సీఎం కేసీఆర్​ సోమవారం మధ్యాహ్నం ఆయనకు టికెట్​ ఖరారు చేసిన వెంటనే దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్​ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కొంతకాలంగా బీఆర్ఎస్ లో జరుగుతున్న సంఘటనలు తనను మానసికంగా బాధించాయని, పార్టీ పరువుకు, ప్రతిష్టకు భంగం కలిగించే దిగజారుడు పరిణామాలు చూడలేక, తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారుతున్నానని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో మంగళవారం హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్  అయ్యారు.

ఆయనతో పాటు చింతపల్లి సర్పంచ్ అక్కల దేవక్క, తానిమడుగు సర్పంచ్ పెండ్రం ప్రేమల, దండేపల్లి మాజీ ఎంపీపీ ముత్యాల శంకరయ్య, వెల్గనూరు మాజీ సర్పంచ్ లింగాల తిరుపతి, గూడెం మాజీ ఎంపీటీసీ ముత్తె నారాయణ వారి అనుచరులతో కాంగ్రెస్​లో చేరారు. అలాగే, మంచిర్యాల టికెట్  ఆశించిన తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్  కార్పొరేషన్  మాజీ చైర్మన్ పూస్కూరు రామ్మోహన్ రావు మద్దతుదారులు దివాకర్ రావుకు సహకరించే పరిస్థితి లేదు. ఈ లిస్టులో హాజీపూర్  జడ్పీటీసీ పూస్కూరు శిల్ప, ఆమె భర్త శ్రీనివాస్ రావు, లక్సెట్టిపేటకు చెందిన బియ్యాల తిరుపతితో పాటు నియోజకవర్గానికి చెందిన చాలా మంది లీడర్లు ఉన్నారు.

భగ్గుమంటున్న బీసీ లీడర్లు

మంచిర్యాల నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో బీసీ నినాదం బలంగా తెరపైకి వచ్చింది. సెగ్మెంట్ లో 98 శాతం బడుగు బలహీన వర్గాలుండగా, ఇందులో బీసీలు 68 శాతం మంది ఉన్నారు. కానీ, 3వేల ఓట్లు కూడా లేని అగ్రకులాల వారే 70 ఏండ్లుగా అధికారాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఈసారి అన్ని పార్టీలు బీసీలకే టికెట్లివ్వాలని లీడర్లు డిమాండ్  చేస్తుండగా, బీఆర్ఎస్​ టికెట్​ను మళ్లీ వెలమ సామాజికవర్గానికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

మంచిర్యాల, నస్పూర్  మున్సిపల్  వైస్  చైర్మన్లు గాజుల ముఖేశ్ గౌడ్ , తోట శ్రీనివాస్, మాజీ మావోయిస్టు దొమ్మటి అర్జున్, తెలంగాణ జాగృతి లీడర్ అక్కల తిరుపతివర్మ, మార్కెట్  కమిటీ చైర్మన్  పల్లె భూమేశ్ బీసీ జెండా ఎత్తుకున్నారు. పార్టీలు టికెట్ ఇవ్వకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాలతో కలిసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించుతామని ఇప్పటికే ప్రకటించారు. 

అరవింద్​రెడ్డి దూరం

మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్​రెడ్డి ఈసారి మంచిర్యాల బీఆర్​ఎస్​ టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది. దీంతో మనస్తాపం చెందిన ఆయన భవిష్యత్​ కార్యాచరణ ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. గత ఎన్నికల్లో దివాకర్​రావు గెలుపులో అరవింద్​రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈసారి ఆయన సపోర్టు లేకుంటే దివాకర్​రావు గెలుపు కష్టమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

చిన్నయ్యకు చిక్కులే.. పొంచి ఉన్న శేజల్ ​గండం

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎలాగోలా టికెట్​ తెచ్చుకున్నప్పటికీ నియోజకవర్గంలో పరిస్థితులు ఆయనకు అంత అనుకూలంగా లేవు. కన్నెపల్లి ఎంపీపీ భర్త నర్సింగరావు, వేమనపల్లి జడ్పీటీసీ భర్త రుద్రభట్ల సంతోష్ తో పాటు వివిధ మండలాలకు చెందిన పలువురు లీడర్లు, వారి ఫాలోవర్స్​  చిన్నయ్యకు దూరంగా ఉంటున్నారు. మాజీ మంత్రి గడ్డం వినోద్​కు కాంగ్రెస్​ టికెట్​ ప్రకటించిన వెంటనే వారంతా ఆ పార్టీలోకి జంప్ ​చేయనున్నారు. అరిజిన్​ డెయిరీ వివాదంలో పీకల్లోతు కూరుకుపోయిన చిన్నయ్యకు శేజల్ ​గండం ఇంకా పొంచి ఉంది. చిన్నయ్యపై కేసు ఫైల్​ చేసి తనకు న్యాయం చేయాలంటూ ఏడు నెలలుగా ఆమె గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడుతూనే ఉన్నారు.

మహిళల జీవితాలతో ఆడుకుంటున్న చిన్నయ్యకు టికెట్​ ఇవ్వొద్దని సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​లకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, ఆయన ఎట్లా గెలుస్తారో చూస్తానని ఆమె అంటున్నారు. ఎన్నికల టైమ్​లో నియోజకవర్గంలో గడప గడపకూ వెళ్లి చిన్నయ్య బండారం బయటపెడుతానని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యేపై హైకోర్టులో కేసు కూడా ఫైల్​ చేస్తానంటున్నారు. ఈ వివాదం చిన్నయ్యకు మైనస్​ కానుంది. 

చెన్నూర్​ లీడర్లు సహకరించేనా?

చెన్నూర్​ ఎమ్మెల్యే బాల్క సుమన్​ ఒంటెత్తు పోకడలతో విసుగు చెందిన పలువురు లీడర్లు ఎలాగైనా ఆయనను అక్కడి నుంచి సాగనంపాలని కంకణం కట్టుకున్నారు. జిల్లా స్థాయి మాజీ ప్రతినిధి ఆధ్వర్యంలో చెన్నూర్​, కోటపల్లి, జైపూర్​, భీమారం మండలాలకు చెందిన అసంతృప్త నాయకులు పార్టీ మారే ప్లాన్​లో ఉన్నారు. మరికొందరు లీడర్లు సుమన్​ వెంటే ఉండి  ఆయనను దెబ్బతీసేందుకు వ్యూహాలు రచిస్తుండడం ఆసక్తిరేపుతోంది.