ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం : కల్వకుంట్ల కవిత

 ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం :  కల్వకుంట్ల కవిత
  • రైతులు, మహిళలు దండుగా కదిలిరావాలి
  • ఎల్కతుర్తిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హనుమకొండ/ఎల్కతుర్తి, వెలుగు : రజతోత్సవాలు టీఆర్​ఎస్​ కా.. బీఆర్​ఎస్​ కా.. అని మాట్లాడుతున్నరు. కాంగ్రెస్​ నాయకుల్లారా ఖబడ్దార్. అవాక్కులు చవాకులు మాట్లాడితే ఊరుకోం.  సభలో పల్లీబఠాణీ అమ్ముకునేంత మంది కూడా లేరు.. గులాబీ సైనికులు మీ మాటలు చూస్తూ ఊరుకోరు' అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.  బీఆర్​ఎస్​ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్​ రెడ్డి రూపొందించిన పార్టీ రజతోత్సవ సభ పాటను హనుమకొండలో గురువారం ఆమె రిలీజ్​ చేశారు. ఎల్కతుర్తిలో రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లను  పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ  ‘16 నెలల్లో 16 పనులు కూడా చేయలేదు. మీ నైజమేందో తెలిసింది. మీది చేతగాని ప్రభుత్వమని ప్రజలు గుర్తించిన్రు' అని విమర్శించారు.

టీఆర్​ఎస్​, బీఆర్​ఎస్​ అంటూ కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారని, టీఆర్​ఎస్​ పేరుతో ప్రజల మన్ననలు పొంది, జాతీయ స్థాయిలో దేశానికి సేవ చేసేందుకు బీఆర్​ఎస్​ గా రూపాంతరం చెందామన్నారు. పరిణతి చెందడం ప్రకృతి ధర్మమని అన్నారు.  చిత్తశుద్ధి ఉంటే బీఆర్​ఎస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు కొనసాగించాలని, కాళేశ్వరం, భగీరథ నీళ్లు ఇవ్వలేక ఆరోపణలు చేస్తే సహించబోమన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లు నింపక, లక్షల ఎకరాలు ఎండబెట్టిందని, అందుకే కాంగ్రెస్ హయాంలో దగాపడిన రైతులు, ఆ పార్టీ హామీలకు మోసపోయిన మహిళలు గులాబీ దండుకట్టి రావాలని పిలుపునిచ్చారు.  

తెలంగాణ నవ యువకులకు గులాబీ జెండా పోరాట చరిత్రను తెలిపేందుకు సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు.  అందుకే యువకులు సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఆమె వెంట ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్​ రావు, మాజీ ఎంపీ మాలోత్​ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, వొడితల సతీశ్​ కుమార్, బీఆర్​ఎస్ ప్రధాన కార్యదర్శి బాలమల్లు,​ పార్టీ రాష్ట్ర నేత ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్, స్థానిక నాయకులు  పాల్గొన్నారు.