బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో..దాసరి, పుట్ట మధుకు చెక్​

  • అసమ్మతి పేరుతో వదిలించుకునేందుకు అధికార పార్టీ ​కొత్త స్కెచ్​
  •     అసమ్మతికి ఇన్‌‌‌‌‌‌‌‌డైరెక్ట్​ గా హైకమాండ్​ సమ్మతి! 
  •     కన్ఫ్యూజన్‌‌‌‌‌‌‌‌లో దాసరి, పుట్ట మధు
  •     సేఫ్​జోన్​లో కోరుకంటి?

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మంథని నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి పుట్ట మధుకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్​ హైకమాండ్​ రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలవరని భావిస్తున్న వీరిని వదిలించుకునేందుకు హైకమాండ్​ అసమ్మతిని ఎంకరేజ్​చేస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా తొలగిస్తే పార్టీలో విభేదాలు వస్తాయన్న ఆలోచనతో హైకమాండ్​ ఈ ప్లాన్​వేసినట్లు సమాచారం. అసమ్మతిని కంట్రోల్​చేసేందుకు హైకమాండ్​ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా ఇన్‌‌‌‌‌‌‌‌డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా అసమ్మతిని ఎంకరేజ్​ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డికి ఇంటిపోరు తప్పడం లేదు. అలాగే మంథనిలో నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా ఉన్న పుట్ట మధు మీద ఏడాదిగా సోషల్​మీడియాలో విమర్శలు కొనసాగుతున్నాయి. మరోవైపు  ఇటీవల జరిగిన కార్యక్రమంలో రామగుండంపై మంత్రి కేటీఆర్​ క్లారిటీ ఇచ్చినట్లు క్యాడర్ ​భావిస్తోంది. దీంతో సిట్టింగ్​ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ వ్యతిరేక వర్గం సైలెంట్​ అయినట్లు తెలుస్తోంది. 

డేంజర్​ జోన్‌‌‌‌‌‌‌‌లో దాసరి...

పెద్దపల్లి నియోజకవర్గంలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలతో ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి డేంజర్ జోన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్లు తెలుస్తోంది.  గతేడాది సీఎం కేసీఆర్ ​పెద్దపల్లి జిల్లాలో పర్యటనలో దాసరికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదన్న చర్చ జరిగింది. నాటి నుంచి నియోజకవర్గంలో దాసరిపై సొంత పార్టీ నేతలు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అలాగే ఇసుక, మట్టి అక్రమ రవాణాలో ఎమ్మెల్యే హ్యాండ్​ ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ ఆరోపణలకు ఎమ్మెల్యే ఇప్పటిదాకా సరైన కౌంటర్ ఇయ్యలేకపోయారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ భానుప్రసాదరావు సన్మానం, ఆత్మీయ సమ్మేళనాల్లోనూ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఇటీవల మున్సిపల్​ మాజీ చైర్మన్​ రాజయ్య ప్రెస్​మీట్​పెట్టి మరోసారి ఎమ్మెల్యే దాసరికి టిక్కెట్​ఇస్తే సీటు వదులుకోవాల్సిందేనని, అదే జరిగితే ప్రగతిభవన్​ ముందు నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. ఇటీవల పెద్దపల్లి మార్కెట్​ కమిటీ చైర్మన్​ నియామకంలో కూడా ఎమ్మెల్యే దాసరి మాట చెల్లుబాటు కాలేదని క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చర్చ జరుగుతోంది. దాసరికి అత్యంత సన్నిహితుడైన పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్​కుమార్​కు చైర్మన్ ​పదవి ఇప్పించలేకపోయాడని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆయన కూడా పార్టీని వదిలేస్తానని ఓపెన్‌‌‌‌‌‌‌‌గానే ప్రకటించాడు. ఇంత జరుగుతున్నా హైకమాండ్​ మాత్రం నోరు మెదపడం లేదు. 

పుట్ట సెల్ఫ్​గోల్​ వేసుకుంటున్నడు...

బీఆర్ఎస్​ పెద్దలు మంథని నియోజకవర్గం ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి పుట్ట మధును మొదట్లో ఎంకరేజ్​ చేశారు. 2018లో ఓడిపోయినా జడ్పీ చైర్మన్​ కట్టబెట్టారు.  ఆ తర్వాత జరిగిన పరిణామాలు మధును హైకమాండ్​కు దూరం చేస్తూ వచ్చాయి.  డబుల్​మర్డర్​ కేసు ఆరోపణలు ఆయనను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అలాగే పార్టీని వీడిన ఓ ప్రముఖ నాయకుడితో మధుకు ఇంకా సత్సంబంధాలు ఉన్నాయని, ఆయనను ఇప్పటికీ రహస్యంగా కలుస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.  దీంతో మధుకు పార్టీలో ప్రయారిటీ తగ్గుతోందని క్యాడర్​చర్చించుకుంటున్నారు. అలాగే మధు దూకుడు నిర్ణయాలు కూడా ఆయనను ఇరుకున పడేసినట్లు తెలిసింది. నియోజకవర్గంలో మీటింగ్‌‌‌‌‌‌‌‌లు పెట్టి సొంత ఎజెండాను అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు బీఆర్ఎస్​ టికెట్​ రాదని తెలిసే బహుజనవాదం ఎత్తుకున్నారని సోషల్​ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ మధ్య మధు ఇంటర్వ్యూలు కూడా ఆయనను డిఫెన్స్​లో పడేశాయి.  పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లోనూ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేటీఆర్ ఫొటోలు, వారి గురించి ప్రస్తావించకపోవడం కూడా హైకమాండ్‌‌‌‌‌‌‌‌కు చేరింది. ఈ నేపథ్యంలో చల్లా నారాయణరెడ్డిని ఎంకరేజ్​ చేస్తున్నారనే టాక్​ వినపడుతుంది. 

చందర్​ టికెట్​ కన్ఫామేనా? 

రామగుండం ఎమ్మెల్యే సేఫ్​ జోన్​లోకి పోయినట్లే అని  చందర్​ వర్గీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల కంటే రామగుండం టిక్కెట్​కోసం ఆశావహులు ఎక్కువే ఉన్నారు. ఎవరికి వారు టిక్కెట్​ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇటీవల రామగుండం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ, చందర్​ ఉద్యమకారుడు, అభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడని, ఆయనను నియోజకవర్గ ప్రజలు కాపాడుకోవాలన్నారు. దీన్ని బట్టి ఇన్‌‌‌‌‌‌‌‌డైరెక్ట్​గా రామగుండం టికెట్ ​ఆయనకేనన్న సంకేతాలను కేటీఆర్​ఇచ్చారు. దీంతో కొంతకాలంగా అసమ్మతిరాగం ఎత్తుకున్న కొందరు ఆశావహులు సైలెంట్​అయ్యారు.