
- తెలంగాణ ప్రయోజనాలకు బీఆర్ఎస్ ఎంత అవసరమో..
- కేసీఆర్ సీఎం కావడం అంతే అవసరం: కేటీఆర్
- రాష్ట్రాన్ని కేసీఆర్ ఆదర్శంగా నిలిపితే.. కాంగ్రెస్ సంక్షోభంలోకి నెట్టిందని ఫైర్
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్25 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజల పండుగలాగా పార్టీ సిల్వర్‌జూబ్లీ వేడుకలను నిర్వహించాలని కేసీఆర్ చెప్పారని పార్టీ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ విముక్తి కోసం ఎదురు చూసే క్రమంలో కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా చరిత్రను ప్రసవించిన పార్టీ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అని పేర్కొన్నారు. పార్టీ 25 ఏండ్లు పూర్తి చేసుకోనుండడం తెలంగాణ సామాజిక చరిత్రలో ఉజ్వలఘట్టమన్నారు. ‘‘తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీనే రక్షణ కవచం. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ఎంత అవసరమో.. కేసీఆర్ మళ్లీ సీఎం కావడమూ అంతే ముఖ్యం.
అందుకు కేసీఆర్పుట్టినరోజున వెల్లువలా తరలివచ్చిన ప్రజలే సాక్ష్యం. మాకు అధికారం పరమావధి కాదు. తెలంగాణ అస్థిత్వం, ప్రజల ప్రయోజనాలే ముఖ్యం” అని చెప్పారు. బుధవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ నేతృత్వంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యంలో పార్టీలు గెలుస్తుంటయ్.. ఓడుతుంటయ్. కానీ అల్టిమేట్‌గా ప్రజలు గెలవాలన్నదే మా సిద్ధాంతం. పార్టీ సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తాం. ఈ ఉత్సవాలపై నాలుగైదు రోజుల్లో కమిటీలను వేస్తాం. వీటిల్లో పార్టీ నేతలతో పాటు ఉద్యమకారులకు అవకాశం కల్పిస్తాం” అని తెలిపారు.
సీఎం చిల్లర మజాక్ లు చేయొద్దు..
కాంగ్రెస్14 నెలల పాలనలోనే ప్రజలు తల్లడిల్లిపోతున్నారని కేటీఆర్అన్నారు. కేసీఆర్రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపితే.. కాంగ్రెస్ప్రభుత్వం మాత్రం సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. కులగణన రీసర్వే చేయాలని అడిగితే.. ప్రభుత్వం సిల్లీగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ‘‘ఏమైనా అంటే కేసీఆర్, కేటీఆర్వివరాలు ఇవ్వలేదని అంటున్నారు. నా ఆస్తులు, ఇతర వివరాలన్నీ ఎలక్షన్ అఫిడవిట్లో ఉన్నాయి కదా!
సీఎం చిల్లర మజాక్లు చేయొద్దు. బీసీల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారో చెప్పాలి” అని అన్నారు. సీఎం రేవంత్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదని, కనీసం ఇంట్లో అయినా పట్టించుకుంటున్నారో లేదోనని కామెంట్ చేశారు. ప్రభుత్వం తన మీద ఏదో ఒక కేసు పెట్టి, లోపల వేయాలని అనుకుంటున్నదని ఆరోపించారు.