- స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని పిటిషన్లు
- దానం, కడియం శ్రీహరి, తెల్లంపై ఎస్ఎల్పీ
- మిగతా ఏడుగురిపై రిట్ పిటిషన్ దాఖలు
న్యూఢిల్లీ, వెలుగు: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్ కు ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. 10 మంది ఎమ్మెల్యేలపై రెండు పిటిషన్లు దాఖలు చేసింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌పై స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ), మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ తరఫున అడ్వకేట్ మోహిత్ రావు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై దాదాపు 250 పైగా పేజీలతో ఎల్ఎల్పీ ఫైల్ చేశారు. ఇందులో హైకోర్టు ఆదేశాలు, ఫిరాయింపులపై స్పీక ర్కు అందజేసిన కంప్లైంట్లు, ఇతర అంశాలను జత చేశారు.
ఏడుగురు ఎమ్మెల్యేలపై సుమారు 500 పేజీ లతో రిట్ పిటిషన్ వేశారు. పార్టీ మారిన ఈ పది మందిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా.. 9 నెలలుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్లలో ప్రస్తావించారు. తమ పిటిషన్లపై హైకోర్టు ఆర్డర్ వచ్చి 6 నెలలు గడుస్తున్నా.. కనీసం స్పీకర్ ఆఫీసు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇవ్వలేదని కోర్టుకు నివేదించారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి గతంలో కేశం మేఘా చంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కారారు. ఈ తీర్పు ప్రకారం.. పార్టీ ఫిరాయింపులు, ఫిర్యాదులపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పిటిషన్ లో పొందుపరిచింది. ఈ తీర్పును పరిగణలోకి తీసుకొని పార్టీ మారిన 10 మందిపై నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అనర్హత పై స్పీకర్/ అసెంబ్లీ సెక్రటరీలకు సూచించాలని కోరింది.
కేసీఆర్ డైరెక్షన్లో..
ఫార్ములా–ఈ రేసు కేసులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ, ఈడీల చుట్టూ తిరుగుతుంటే గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం పార్టీ ఫిరాయింపులపై ఫోకస్ పెట్టారు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను బుధవారం సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అయితే... అదే రోజు సాయంత్రం పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని పార్టీ లీగల్ టీంకు ఆదేశాలు జారీ చేశారు. ఈ బాధ్యతలను సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు అప్పగించారు. దీంతో బుధవారం ఢిల్లీకి చేరిన హరీశ్ అడ్వకేట్ మోహిత్ రావు, ఇతర లీగల్ టీం తో సమావేశం అయ్యారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలు చేయాల్సిన ఎస్ఎల్పీ, రిట్ పిటిషన్లపై చర్చించారు. అనంతరం మోహిత్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్లు ఫైల్ చేశారు. అయితే ఈ పిటిషన్లపై మాత్రం సుప్రీంకోర్టు ముందు స్పెషల్ మెన్షన్ చేసే యోచనలో బీఆర్ఎస్ లేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కేసు బెంచ్ ముందుకు వచ్చినప్పుడే వాదనలు వినిపించాలని డిసైడ్ అయింది.