- గీత దాటిన వారిపై వేటుకు వెనుకడుగు..!
- పార్టీ మారినా సస్పెండ్ చేస్తలేరెందుకు..?
- ఆలస్యం చేయటంలోల భవన్ ఆంతర్యం ఏమిటి?
- ఆ సెగ్మెంట్లలో క్యాడర్ చీలిపోతుందని భయమా?
గీత దాటిన వారిపై వేటు వేయడంలో గులాబీ పార్టీ ఎందుకు తాత్సారం చేస్తోందనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఇద్దరు జెడ్పీ చైర్మన్లు, ఎస్సీ కార్పరేషన్ మాజీ చైర్మన్, ఓ డీసీసీబీ చైర్మన్ డైరెక్టుగా కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రజా క్షేత్రంలో తిరుగుతున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం హాట్ టాపిక్ గా మారింది. క్యాడర్ చీలిపోతుందని భయమా..? ఆ సెగ్మెంట్లలో ఇంకా ఏమైనా ఇబ్బందులున్నాయా..? అన్న చర్చ సాగుతోంది. గద్వాల జెడ్పీ చైర్ పర్సన్ సరిత, పొంగులేటి ప్రధాన అనుచరుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరెం కనకయ్య ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. కండువాలు కప్పుకొని కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు కూడా పొంగులేటి వెంట హస్తం తీర్థం పుచ్చుకున్నారు.
వీరితో పాటు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి కాంగ్రెస్ లో చేరిన కంటోన్మెంట్ నుంచి పోటీకి దరఖాస్తు కూడా చేసుకున్నారు. సెగ్మెంట్ పరిధిలో భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆయన ఇటీవలే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలువడం విశేషం. పొంగులేటి సైతం తుమ్మల తో భేటీ అయ్యారు. ఆయనను సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ కండువా కప్పు కొన్నా పార్టీ నాయకత్వం ఎందుకు స్పందించ డం లేదన్న చర్చ జోరుగా సాగుతున్నది. గీత దాటినా వేటు వేయలే..
'పార్టీ గీత దాటితే వేటు తప్పదని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతుంటారు. వీళ్ల విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనేది అంతుచిక్కడం లేదు. ఖానాపూర్ టికెట్ ను జాన్సన్ నాయక్ కు కేటాయించడంతో అలిగిన రేఖానాయక్ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆమె భర్త శ్యాంనాయక్ ఆసిఫాబాద్ టికెట్ కోసం పీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరనున్నట్టు మీడియా ముఖంగా ప్రకటించారు.అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. మంత్రి హరీశ్ రావును ఉద్దే శించి చేసిన వ్యాఖ్యలు మీడియాలో సంచలనం రేపాయి. అదే రోజు తెలంగాణ భవన్ లో జరిగిన అభ్యర్థుల జాబితా విడుదల మీటింగ్ లో 'నో ప్రాబ్లం.. ఆయన వద్దనుకున్నంక మేమేం చేస్తం' అంటూ సీఎం కేసీఆర్ సుతి మెత్తగా స్పందించారు. ఎమ్మెల్సీ కవిత కూడా ట్వీట్ ద్వారా మైనంపల్లి కామెంట్లను తప్పు పట్టారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ కూడా మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు. ఆ తర్వాత మైనపంల్లి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగింది. ఆయనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మై సంపల్లి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అటు గులాబీ పెద్దలు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.
క్యాడర్ చీలుతుందని భయమా..?
టీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరిక తర్వాత పలు సెగ్మెంట్లలో రాజకీయ పరి స్థితులు పూర్తిగా మారిపోయాయి. అక్కడే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉండటం.. క్యాడర్ రెండు వర్గాలుగా విడిపోవడం.. పార్టీ కార్య క్రమాలను వేర్వేరుగా చేయడం.. ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పెద్దలు సిట్టింగులకే సీట్లు కేటా యించడంతో 12 చోట్ల కాంగ్రెస్ నుంచి చేరిన వారికే అవకాశం దక్కింది. దీంతో ఆయా స్థానాలపై ఆశలు పెట్టుకున్న పాత నేతలకు పక్కచూపులు చూస్తున్నారు. ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ అధినాయకత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.