యాదాద్రి, తుంగతుర్తి, వెలుగు: రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిశోర్ కుమార్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోత్కూర్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. రైతులకు మూడు గంటల కరెంటు చాలని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి రైతుల గురించి ఏం అవగాహన ఉంటుందన్నారు.
రైతుల సంక్షేమం కోరే సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నారని స్పష్టం చేశారు. 3 గంటల కరెంట్ కావాలో.. 24 గంటల కరెంట్ కావాలో.. ప్రజలు ఆలోచించాలని కోరారు. ఎస్సారెస్పీ ద్వారా కాలేశ్వరం జలాలు తీసుకొచ్చి 95 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామన్నారు. మోత్కూర్, అడ్డగూడూరు ప్రాంతాలకు నీళ్లిచేందుకు గత పాలకులు ప్రణాళిక లేకుండా కాలువ తవ్వారని మండిపడ్డారు.
ఈ కాలువను పూర్తి చేసి బస్వాపూర్ రిజర్వాయర్ కు లింకు చేసి గోదావరి జలాలు అందిస్తానన్నారు. అంతకుముందు తుంగతుర్తి మండలం గానుగుబండ, అన్నారం, తుంగతుర్తి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు.