అన్ని డైరెక్టర్​ స్థానాలు బీఆర్​ఎస్​ ఖాతాలోనే..

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్ ) ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. 15 డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 15  స్థానాలను ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులే  కైవసం చేసుకున్నారు. బీజేపీ అన్నిచోట్లా బీఆర్​ఎస్​కు గట్టి పోటీ ఇచ్చింది. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సెస్ పరిధిలోని13మండలాలు, రెండు మున్సిపాలిటీలతో పాటు చొప్పదండి, మానకొండూర్ నియోజక వర్గాల్లోని రెండు మండలాల పరిధిలో ఈ నెల 24 న ఎన్నికలు జరగ్గా, సోమవారం కౌంటింగ్​ తర్వాత ఫలితాలు విడుదల చేశారు.

ఆరు స్థానాల్లో నువ్వా నేనా..

సెస్ పరిధిలో 15 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, అన్ని స్థానాల్లో రూలింగ్​పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. 6 స్థానాల్లో నువ్వా నేనా అన్నట్లు పోరాడింది. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల టౌన్ వన్, చందుర్తి, వేములవాడ రూరల్, రుద్రంగి, కోనరావుపేట డైరెక్టర్ స్థానాల్లో బీఆర్​ఎస్​కు ముచ్చెమటలు పట్టాయి. ఈ స్థానాల్లో కొద్దిపాటి తేడాతోనే అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. రూలింగ్ ​పార్టీ మద్యం, డబ్బు పంచిందనే ఆరోపణలు వచ్చాయి. ఎన్నికలకు ఒక రోజు ముందు కేవలం సిరిసిల్ల జిల్లా రైతులకు  రైతుబంధు విడుదల చేయడం ద్వారా బీఆర్​ఎస్​ ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేసింది. అయినా బీజేపీకి గతంలో ఎన్నడూ లేనంత ఓటు బ్యాంక్ పెరిగింది. దాదాపు అన్ని స్థానాల్లో రెండో ప్లేస్ లో నిలిచింది. అదే సమయంలో కాంగ్రెస్ చతికిలపడింది. ఒక్క స్థానాన్ని కూడా నిలబెట్టుకోకపోగా కనీసం  పోటీ  కూడా ఇవ్వలేకపోయింది. వేములవాడ అర్బన్ మండలం గెలుస్తుందనుకున్నప్పటికీ అక్కడా ఓటమిపాలైంది. దీంతో వీర్నపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూత శ్రీనివాస్ పదవికి రాజీనామా చేశారు.  కాంగ్రెస్  అభ్యర్థి లెంకల లక్ష్మణ్​ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీకి రిజైన్ చేస్తున్నట్లు శ్రీనివాస్​ ప్రకటించాడు.