పంచాయతీల పెండింగ్ బిల్లులపై అసెంబ్లీలో ‘పంచాయతీ’

పంచాయతీల పెండింగ్ బిల్లులపై అసెంబ్లీలో ‘పంచాయతీ’
  • అధికార పక్షంXప్రధాన ప్రతిపక్షం
  • సర్పంచుల బిల్లుల కోసం బీఆర్ఎస్ పట్టు
  • బకాయిలు పెట్టిందే మీరు: మంత్రి సీతక్క
  • బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి
  • రూ. 690 కోట్ల బిల్లులు డ్యూ పెట్టారన్న మంత్రి
  • అప్పుడే హరీశ్ ఒక్క సంతకం చేసుండేదని వ్యాఖ్య
  • కేసీఆర్.. పల్లెలను అద్భుతంగా తీర్చిదిద్దారు
  • అందుకే కేంద్రం నుంచి అవార్డులొచ్చాయి
  • సభలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు
  • సర్కారు తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ వాకౌట్

హైదరాబాద్: పంచాయతీలకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మధ్య మాట​ల యుద్ధం కొనసాగింది. గత ప్రభుత్వం పంచాయతీలకు రూ. 690 కోట్లు  పెండింగ్ లో పెట్టిందని, అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్ రావు ఒక్క  సంతకం చేసి ఉంటే ఆ బిల్లులన్నీ క్లియర్ అయ్యేవని అన్నారు. అసలు బీఆర్ఎస్ అంటేనే బకాయిల రాష్ట్ర సమితి అని.. ఎక్కడ పడితే అక్కడ బిల్లులు పెండింగ్  పెట్టిందని చెప్పారు.

దీనిపై హరీశ్ రావు మాట్లాడుతూ..  రాష్ట్రంలో బడాబడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు కానీ సర్పంచులకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాకపోవడంతో సర్పంచులు  గవర్నర్ ను కలిసి మొర పెట్టుకున్నారు, మంత్రులను కలిసి మొరపెట్టుకున్నారన్నారు. వారు తమ బాధ చెప్పుకొనేందుకు హైదరాబాద్ వస్తే ఎక్కడిక్కడ వారిని అరెస్టులు చేశారని చెప్పారు. కేసీఆర్  పల్లెలను అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి లాంటి గొప్ప కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు.

పల్లె ప్రగతికి 275 కోట్లు, పట్టణ ప్రగతికి 150 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. దేశ వ్యాప్తంగా ఉత్తమ గ్రామపంచాయతీలుగా 20 ఊళ్లను ప్రకటిస్తే.. తెలంగాణ గ్రామాలు 19 ఉన్నాయని అన్నారు.  తాము నిధులు ఇవ్వకుంటే అవార్డులు ఎలా వచ్చేవని ప్రశ్నించారు.  సర్పంచుల బిల్లుల  పెండింగ్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.