- ఎర్రకుంట తండాలో సంక్షేమ పథకాల సభలో రచ్చ
- ఎమ్మెల్యే పల్లా వెళ్లగా.. జై అంటూ క్యాడర్ నినాదాలు
- కాంగ్రెస్ కార్యకర్తలు వ్యతిరేకించడంతో ఉద్రిక్తత
జనగామ, వెలుగు: ప్రభుత్వ సంక్షేమ పథకాల సభ జనగామ జిల్లా ఎర్రకుంట తండాలో రచ్చ రచ్చగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రికత్త నెలకొంది. పోలీసులు లాఠీచార్జ్ చేసినా ఇరువర్గాలు వెనక్కి తగ్గలేదు. దీంతో మంత్రి పొంగులేటి పాల్గొనాల్సి ఉండగా పర్యటన రద్దైంది. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర ప్రభుత్వ నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించేందుకు ఆదివారం ఎర్రకుంట తండాలో నిర్వహించే సభకు మంత్రి పొంగులేటి హాజరవుతుండగా.. బీఆర్ఎస్లీడర్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. దీంతో వారిని విడిచిపెట్టాలంటూ సభ వేదిక వద్దకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పార్టీ కార్యకర్తలతో వెళ్లి డీసీపీ రాజమహేంద్రనాయక్ను కోరారు.
మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు పల్లాకు జై అంటూ నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్లీడర్లు కూడా వ్యతిరేక నినాదాలు చేశారు. ఇరువర్గాలూ కుర్చీలు విసిరేసుకోవడంతో పాటు కోడిగుడ్లు, టమాటాలు వేసుకోగా.. ఒకదశలో పోలీసులు లాఠీచార్జి చేసినా వెనక్కి తగ్గలేదు. దీంతో ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డిని పోలీసులు జనగామకు తరలించారు. అనంతరం ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము సంయమనంగా ఉన్నా పోలీసులు లాఠీ చార్జ్ చేశారని ఆరోపించారు. 16 మంది బీఆర్ఎస్కార్యకర్తలు, నలుగురు మీడియా పర్సన్స్గాయపడ్డారని తెలిపారు. లాఠీచార్జీపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సీపీ అంబర్ కిషోర్‌ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ను కోరారు. కాగా, కాంగ్రెస్‌ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ఓర్వలేక ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి ఎర్రకుంట తండాలో పంచాయితీ పెట్టేందుకు వచ్చారని జనగామ డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి విమర్శించారు.