- కోస్గిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
- సర్జఖాన్ పేట్లో ఇరుపార్టీల కార్యకర్తల ఘర్షణ
- పోలీసుల లాఠీచార్జ్‌లో పలువురికి గాయాలు
కోస్గి, వెలుగు: నారాయణపేట జిల్లా కొస్గి మండలం సర్జఖాన్పేట్లో మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోమశేఖర్ రెడ్డి తన వాహనాల్లో ఓటర్లకు పంచేందుకు భారీగా డబ్బులు తరలిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆ వెహికల్స్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో సోమశేఖర్ వెంట ఉన్న వ్యక్తులు వాహనాల్లో ఉన్న కట్టెలు, రాడ్లతో కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను తీవ్రంగా కొట్టారు. విషయం తెలుసుకొని కోస్గి మండల కాంగ్రెస్ నాయకులు సర్జఖాన్పేట్కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది.
దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. లాఠీచార్జిలో పలువురికి గాయాలయ్యాయి. కాంగ్రెస్ నాయకుల తీరును నిరసిస్తూ కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కోస్గిలోని శివాజీ చౌక్‌వద్ద ధర్నాకు దిగారు. కాంగ్రెస్‌నేత రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డితో పాటు మరికొందరు లీడర్లు కోస్గికి చేరుకుని సుభాష్‌చంద్రబోస్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు రాళ్ల రువ్వుకోవడంతో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు.