- కేసీఆర్..తెలంగాణ నీ అయ్య జాగీరా?
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నకిరేకల్,( వెలుగు): సీఎం కేసీఆర్.. తెలంగాణ నీ అయ్య జాగీరా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని శ్రీ లక్ష్మీ నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్లో గురువారం సాయంత్రం నకిరేకల్ బీఎస్పీ అభ్యర్థి మేడి ప్రియదర్శిని ఆధ్వర్యంలో నిర్వహించిన నీలి గర్జన బహిరంగ సభకు ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, అడుగడుగునా నిర్బంధాలు, ఆంక్షలు పెడుతున్నారన్నారు. కేసీఆర్గడీల్లో కూర్చొని పథకాలు చల్లుతూ ఓట్లు దండుకుంటున్నాడన్నారు. ఈ ప్రభుత్వం వల్ల బాధపడుతున్న ప్రజలే సీఎంతో పాటు ఆయన కుటుంబాన్ని జైల్లో పెట్టబోతున్నారన్నారు. పోలీసుల అండతో ఎన్నికల్లో అధికార పార్టీ రిగ్గింగ్ చేసి గెలవాలని కుయుక్తులు పన్నుతోందన్నారు. సూర్యాపేట లో వట్టే జానయ్యను చంపించేందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి రూ.కోటి సుపారీ ఇచ్చారని ఆరోపించారు. నకిరేకల్‌లో బీఎస్పీ నీలి గర్జన సభ నిర్వహించకుండా మంత్రి, ఎమ్మెల్యే అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్తున్న ఎమ్మెల్యే ఆయన చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందికంటి విజయ్, రాష్ట్ర కార్యదర్శులు బొడ్డు కిరణ్, నర్రా నిర్మల, జిల్లా అధ్యక్షుడు సైదులు, జిల్లా ఇన్చార్జి అనిల్, నియోజకవర్గ కన్వీనర్ గద్దపాటి రమేశ్, మహిళా కన్వీనర్లు మర్రి శోభ పాల్గొన్నారు. అంతకుముందు టౌన్లో భారీ ప్రదర్శన నిర్వహించారు.
కేసీఆర్, ఎర్రబెల్లిని పోటీ చేయకుండానిషేధించాలి
చౌటుప్పల్: సీఎం కేసీఆర్‌ను, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని ప్రవీణ్ కుమార్ అన్నారు. చౌటుప్పల్‌లో మునుగోడు ఇన్చార్జి ఆందోల్ శంకరాచారి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు బీఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్మాట్లాడుతూ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోగా బీఆర్ఎస్కుఓట్లు వేసే వారికే పథకాలు ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్ లో అనడం సిగ్గుచేటన్నారు. మంత్రి కామెంట్స్ వెనక కేసీఆర్ఉన్నారన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్న పోలీసులను నియమించుకుని ఇష్టమున్నట్టు చేస్తున్నాడన్నారు. మునుగోడు ఎన్నికల్లో పలు గ్రామాలను దత్తత తీసుకుంటానని మోసం చేసిన మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి లపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశాడు. దండు మల్కాపురంలో 150 ఎకరాల కాందిశీకుల భూమిపై మంత్రి, ఎమ్మెల్యే కన్నువేశారన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే చేయించాడని, ఆ వివరాలు దగ్గర పెట్టుకొని ప్రజలతో కేసీఆర్ ఓటు రాజకీయం చేస్తున్నాడని విమర్శించాడు. మహిళా కన్వీనర్ నర్ర నిర్మల, జిల్లా అధ్యక్షుడు ఊదరి సైదులు, నియోజకవర్గ ఇన్చార్జి ఏర్పుల అర్జున్, పల్లె లింగస్వామి, కత్తుల పద్మ, మస్కు నరసింహ, కత్తుల నరసింహ, కత్తుల పరమేశ్, ఎర్రోళ్ల వెంకటయ్య, అంకంపాక శంకర్, రాములు, తగరం సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే, మంత్రుల చిట్టా విప్పుతా
సూర్యాపేట : అధికార పార్టీ నాయకులు పెట్టించే అక్రమ కేసులకు బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు భయపడరని ప్రవీణ్ కుమార్ అన్నారు. సూర్యాపేటలోని విద్యానగర్ లో బీఎస్పీ జిల్లా ఆఫీసు ప్రారంభించడానికి వచ్చిన ఆయనకు బీఎస్పీ నాయకురాలు వట్టె రేణుక జానయ్య యాదవ్ స్వాగతం పలికారు. ఎస్వీ డిగ్రీ కళాశాల నుంచి బీఎస్పీ ఆఫీసు వరకు 10 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత ప్రవీణ్కుమార్మాట్లాడుతూ వట్టె జానయ్య ఆస్తులు ఎంతో అడుగుతున్న మంత్రి జగదీశ్ రెడ్డి తన ఆస్తులను వెల్లడించగలరా అని ప్రశ్నించారు. సూర్యాపేట ఎమ్మెల్యేగా జానయ్యను క్యాంప్ ఆఫీసులో కూర్చోబెట్టి తీరుతామన్నారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్ అధికార పార్టీ నాయకుడికి విద్యార్థులతో జై కొట్టించడం ఏమిటన్నారు. తన 20 ఏండ్ల సర్వీస్ లో ఇలాంటి పోలీస్ ఆఫీసర్‌ను చూడలేదన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి దండు మల్కాపురంలోని కాందిశీకుల భూములను ఆక్రమించారని, కలెక్టరేట్ పక్కన అసైన్డ్ భూములను లాక్కొని దళితులను మోసం చేశారని మండిపడ్డారు. మంత్రితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆక్రమించిన భూములు లక్షల కోట్లల్లో ఉన్నాయని త్వరలోనే చిట్టా బయట పెడతామని చెప్పారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బుడిగం మల్లేష్ యాదవ్, చాంద్ పాషా, శ్రీకాంత్,వల్లాల సైదులు, వెంకట్, రమేశ్ పాల్గొన్నారు.