బీజేపీలోకి బీఆర్‍ఎస్‍ నేత ఆరూరి ?

వరంగల్, వెలుగు : బీఆర్‍ఎస్‍ వరంగల్‍ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‍ బీజేపీలో చేరనున్నట్టు తెలిసింది. సోమవారం రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఆరూరి చేరిక ఉండబోతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో బీఆర్‍ఎస్‍ రెండుసార్లు అధికారంలోకి రాగా.. రెండు ఎలక్షన్లలోనూ హరీశ్​రావు తర్వాత వర్ధన్నపేటలో రెండో అత్యధిక మెజార్టీతో గెలిచిన రికార్డు రమేశ్​ పేరిట ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో..అప్పుడే హస్తం పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్‍ ఆఫీసర్‍ కేఆర్‍.నాగరాజు చేతిలో ఓడారు.

వరంగల్‍ ఎంపీ ఎస్సీ రిజర్వ్​ కావడంతో వచ్చే పార్లమెంట్‍ ఎన్నికల్లో రమేశ్‍ బీఆర్ఎస్ ​క్యాండిడేట్‍గా బరిలో ఉంటారనే ప్రచారం జరిగింది. అదేటైంలో బీజేపీ రమేశ్‍ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా తమ అభ్యర్థిగా పోటీలో ఉంచేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. కాగా, ఆరూరిని బుజ్జగించేందుకు స్టేషన్‍ ఘన్‍పూర్‍ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అయితే, పార్టీ మార్పుపై పెద్ద ఎత్తున చర్చ, ప్రచారం జరిగినా ఆరూరి  రమేశ్​ మాత్రం ఎక్కడా దీన్ని ఖండించలేదు.