- ఉమ్మడి నల్గొండలో 12, రాష్ట్రంలో 80 సీట్లు గెలుస్తం: ఎంపీ కోమటిరెడ్డి
- లెఫ్ట్ పార్టీలకు చెరో రెండు ఎమ్మెల్సీలు, క్యాబినెట్లో స్థానం కల్పిస్తమని వెల్లడి
నల్గొండ అర్బన్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమని కాంగ్రెస్ స్టార్ కాంపెయినర్, నల్గొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ విజయంతోనే రాష్ట్రం, ప్రజలు కేసీఆర్ రాచరిక, కుటుంబ పాలన నుంచి విముక్తి పొందుతారని తెలిపారు. సోమవారం నల్గొండలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ సకల జనుల పోరాటం, ఎంతో మంది ఆత్మబలిదానాలతోనే తెలంగాణ వచ్చింది తప్ప ఎవరో చావు నోట్లో తల పెడితే రాలేదన్నారు. ఉద్యోగులకు ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, కేవలం ఐదు శాతం ఐఆర్ ప్రకటించడం వారిని అవమానించడమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు రూ.వేల కోట్లు కమీషన్లు మింగి లోపభూయిష్టంగా కట్టడంతో బ్యారేజీ కుంగిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లతోపాటు రాష్ట్రంలో మొత్తం 80 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు గెలిచే సీట్లనే అడగాలని, ఓడిపోయే సీట్లను అడిగితే మళ్లీ బీఆర్ఎస్ గెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీపీఎం, సీపీఐలకు చెరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని, అవసరమైతే క్యాబినెట్లో స్థానం కల్పిస్తామన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, అబ్బగోని రమేశ్ గౌడ్, గుమ్ముల మోహన్ రెడ్డి, బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.