పీహెచ్​డీ అక్రమాలపై యాక్షన్​ తీసుకోకపోతే బీఆర్​ఎస్​ను ఓడిస్తం : కేయూ స్టూడెంట్​ జేఏసీ

పీహెచ్​డీ అక్రమాలపై యాక్షన్​ తీసుకోకపోతే బీఆర్​ఎస్​ను ఓడిస్తం :  కేయూ స్టూడెంట్​ జేఏసీ
  • యూనివర్సిటీ బంద్​ ప్రశాంతం

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ పీహెచ్​డీ అడ్మిషన్లలో జరిగిన అవకతవకలపై యాక్షన్​ తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​ను ఓడిస్తామని వర్సిటీ స్టూడెంట్ జేఏసీ నాయకులు హెచ్చరించారు. పీహెచ్​డీ అక్రమాలపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ గాంధీ జయంతి సందర్భంగా ఆందోళన చేసిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టులను నిరసిస్తూ మంగళవారం స్టూడెంట్​జేఏసీ ఆధ్వర్యంలో కేయూ బంద్ కు పిలుపునివ్వగా.. మంగళవారం ఉదయం 11 గంటలకు క్యాంపస్​లో తరగతులు బహిష్కరించారు. పలువురు ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి ఆందోళనకు మద్దతు తెలిపారు. స్టూడెంట్స్ ​వివిధ డిపార్ట్​మెంట్ల నుంచి ర్యాలీగా అడ్మినిస్ట్రేటివ్ ​బిల్డింగ్​కు చేరుకుని, ఆందోళన కొనసాగించారు.

వీసీ తాటికొండ రమేశ్​, రిజిస్ట్రార్​ శ్రీనివాస రావును బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు. పీహెచ్​డీ అడ్మిషన్లలో జరిగిన కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్​చేశారు. నెల రోజులుగా పోరాటం చేస్తున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. తర్వాత వీసీ బిల్డింగ్​ఎదుట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. విద్యార్థులు వీసీ ఛాంబర్​లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కేయూ స్టూడెంట్​జేఏసీ లీడర్​ఇట్టబోయిన తిరుపతి యాదవ్, జేఏసీ వ్యవస్థాపక సభ్యుడు డా.మంద వీరస్వామి, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్​కుమార్​, ఏబీవీపీ కేయూ ఇన్​చార్జి నిమ్మల రాజేశ్, విద్యార్థి సంఘాల నేతలు మాచర్ల రాంబాబు, అరెగంటి నాగరాజు, అంకిల్ల శంకర్, ఎండీ పాషా, బొట్ల మ నోహర్, మట్టెడ కుమార్, జి ప్రశాంత్  పాల్గొన్నారు.