బీఆర్ఎస్ అధికారంలోకి రాదు​..వచ్చినా కూలిపోతుంది : సంజయ్​

జన్నారం, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదని, ఒక వేళ వచ్చినా కల్వకుంట్ల కుటుంబంలో జరిగే  కలహాల కారణంగా కూలిపోతుందని బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ, కరీంనగర్​ఎంపీ బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులు సీఎం పదవి కోసం ఇప్పటి నుంచే గ్రూపులు కడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఆవకాశమిస్తే బీసీని సీఎంను చేసి సుస్థిర పాలన అందిస్తామని సంజయ్​ చెప్పారు. మంచిర్యాల జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రాథోడ్ రమేశ్​కు మద్దతుగా గురువారం సాయంత్రం జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన సింహగర్జన సభకు సంజయ్ ​హాజరై మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్​ను గద్దె దించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఏకం కావాలని ఆయన కోరారు.

కాళేశ్వరం పేరుతో ప్రజల నెత్తిన టోపీ

కాళేశ్వరం ప్రాజెక్టులో సీఎం కేసీఆర్ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, నాసిరకంగా నిర్మించడం వల్లనే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయని సంజయ్​ ఫైర్​అయ్యారు.  ప్రాజెక్టు సందర్శనకు టోపీ పెట్టుకొని వెళ్లిన కేసీఆర్.. ఆ టోపీని ప్రజల నెత్తిన పెట్టాడని ఎద్దేవా చేశారు. కర్నాటకలో బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రైతులు రోడ్ల మీదికి వచ్చారన్నారు. ఖానాపూర్ లో బీజేపీ గెలుస్తుందనే అనుమానంతో సీఎం కేసీఆర్ బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు వందల కోట్లు పంపిస్తున్నాడన్నారు. కేసీఆర్ పంపిన పైసలు తీసుకొని బీజేపీ అభ్యర్థి రాథోడ్ రమేశ్ కు ఓటు వేయాలని ఆయన కోరారు. ఇక్కడ అభ్యర్థులు కరువైనట్లు సీఎం కేసీఆర్ కొడుకు, ట్విట్టర్ టిల్లు దోస్తు ఆమెరికాలో ఉండే జాన్సన్ నాయక్ ను తీసుకువచ్చి బీఆర్ఎస్ టికెట్​ఇచ్చారని.. ఆయన ఓడినా, గెలిచినా మళ్లీ ఆమెరికాకు వెళ్లిపోతాడని అన్నారు. ఆలోచించి ఓటు వేయాలని కోరారు.