రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 17ఎంపీ స్థానాలకు గానూ 14 నుండి 15 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపామని ... కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని చెప్పారు. సూర్యాపేటలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిని మూడు లక్షల నుంచి ఐదు లక్షల భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
పదేళ్లు తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మూడు నెలలు అధికారంలోకి వచ్చి మూడు నెలల్లోనే ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ సగం నెరవేర్చి్ందని చెప్పారు, కేసీఆర్ పై కేసులు ఎక్కడో మీద పడతాయనే ఉద్దేశంతోనే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి పొలం బాట పట్టాడని ఆరోపించారు కోమటిరెడ్డి.
రైతులు కరువు మూలంగా అప్పుల పాలై ఎవరు చనిపోలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి, ఎవరైనా చనిపోయింటే వారిని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయిన మాట వాస్తవమే దానికి రైతులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ శవరాజకీయాలు చేస్తూ రైతుల జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అన్యాయాలపై విచారణ చేపట్టి వారిని జైలుకు పంపడం ఖాయమని మంత్రి చెప్పుకొచ్చారు.