- బీజేపీకి ఒకటి లేదా సున్నా సీట్లే
- కేంద్రంలో రాబోయేది ప్రాంతీయ పార్టీల కూటమే
- రాధాకిషన్‌రావు ఎవరో నాకు తెల్వదు.. ఫోన్ ట్యాపింగ్ ఉత్తి ట్రాష్
- ఎక్కడోడు అక్కడ పండుకుంటే ఒక్కడినే పోరాడి తెలంగాణ తెచ్చిన
- కాంగ్రెస్ నుంచి 30 మంది మా పార్టీలోకి వస్తామంటున్నరు
- బీఆర్‌ఎస్‌ను తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చే ప్రసక్తే లేదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : ప్రధాన మంత్రి పదవి రేసులో తాను కూడా ఉంటానని, అవకాశం వస్తే వదులుకోవడానికి తాను అమాయకున్నేమీ కాదని బీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ అన్నారు. ఈసారి కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని, ప్రాంతీయ పార్టీల కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని చెప్పారు. ఇదేమీ ఆషామాషీగా చెప్పట్లేదని, తన సుదీర్ఘ రాజకీయ అనుభవం, వివిధ వర్గాల నుంచి తీసుకున్న సమాచారాన్ని బట్టి చెబుతున్నానని అన్నారు.
రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు మాత్రమే వచ్చే అవకాశం ఉందని, సౌత్ ఇండియా మొత్తం కలిపి ఆ పార్టీకి పది సీట్లు కూడా రావని చెప్పారు. అందుకే మతం, రిజర్వేషన్లు అంటూ మోదీ బట్టలు చించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజలు చాలా కోపంగా ఉన్నారని, ఆ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి లేదని అన్నారు. రెండు జాతీయ పార్టీలకు షాక్ ఇస్తూ బీఆర్‌ఎస్‌కు 12 నుంచి 14 సీట్లను ప్రజలు ఇవ్వబోతున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. శనివారం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ప్రజలు 14 సీట్లలో బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే తెలంగాణ తడాఖా ఏందో ఢిల్లీలో చూపిస్తానని చెప్పారు. కేంద్ర సర్కారులో బీఆర్‌ఎస్ తరఫున రాజ్యసభ ఎంపీ సురేశ్‌రెడ్డి మెయిన్ప్లేయర్ అవుతారని, ఆయనను పార్లమెంటరీ పార్టీ లీడర్‌ను చేయబోతున్నట్టు కేసీఆర్ వెల్లడించారు.
కాంగ్రెస్‌పై ప్రజలు కోపంగా ఉన్నారు
పదేండ్లలో తాను చేసిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దెబ్బ తీసిందని, తద్వారా కాంగ్రెస్ ప్రజాగ్రహానికి గురైందని కేసీఆర్ అన్నారు. కరెంట్ కోతలు, మంచి నీటి కొరత, రైతు బంధు వేయకపోవడం, రుణమాఫీ చేయకపోవడం, పంట బోనస్ ఇవ్వకపోవడం వంటి అనేక కారణాల వల్ల కాంగ్రెస్‌పై ప్రజలు కోపంగా ఉన్నారని చెప్పారు. ‘‘రేవంత్ ప్రభుత్వానికి పాలసీ లేదు. చిల్లర రాజకీయాల కోసం సమయాన్ని వృథా చేశారు. శ్వేతపత్రాలు అని పెట్టి అసెంబ్లీలో కూడా చిల్లర చేశారు. మాట్లాడకూడని భాష మాట్లాడారు.
ప్రజలు చీదరించుకుంటున్నారు. అతి తెలివితో, అసమర్థతతో మంచి ఆఫీసర్లను తీసేసి.. ఐఏఎస్‌లను పెట్టి వ్యవస్థను నాశనం చేశారు” అని కేసీఆర్ విమర్శించారు. మిషన్ భగీరథ నిర్వహణ సరిగ్గాలేక నీటికొరత ఏర్పడిందని, ఈ ఆరు నెలల్లోనే హైదరాబాద్ ప్రజలు 2.5 లక్షల ట్యాంకర్ల నీటిని కొన్నారని చెప్పారు. ఈ పరిస్థితి చూసి తినే అన్నంలో మన్ను పోసుకున్నం అని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. తమ సర్కారు హయాంలో మొలకెత్తిన వడ్లను కూడా కొనుగోలు చేశామని, కానీ.. కాంగ్రెస్ సర్కారు మాత్రం కొంటలేదని ఆరోపించారు.
ఏ సంవత్సరమో చెప్తలేడు?
రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట తప్పిండని కేసీఆర్ అన్నారు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తానన్నాడని, ఇప్పుడు పంద్రాగస్ట్‌కు చేస్తానంటున్నాడని తెలిపారు. ఆయన చెబుతున్నది ఏ సంవత్సరపు ఆగస్టో క్లారిటీ ఇవ్వడం లేదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.
సౌత్‌లో బీజేపీకి పది సీట్లు కూడా రావు
మోదీ, అమిత్‌షా చేసేదంతా గోబెల్స్ ప్రచారమేనని, ఈసారి వాళ్ల బీజేపీకి 200 సీట్లు కూడా రావని కేసీఆర్ అన్నారు. బీజేపీ హయాంలో ట్రాష్, గ్యాస్ తప్ప ఏమీ లేదని పేర్కొన్నారు. బీజేపీకి తెలంగాణలో వన్ ఆర్ నన్.. గెలిస్తే ఒక్క సీటు గెలవొచ్చని, సౌత్ ఇండియా నుంచి బీజేపీకి పది సీట్లు కూడా దాటవని అన్నారు. బీజేపీకి ఓటేస్తే వచ్చేదేమీ లేదని, తెలంగాణ బిడ్డలు గెలువడం ముఖ్యం అని కేసీఆర్ అన్నారు.
రాధాకిషన్‌రావు ఎవడయ్యా?
ఫోన్ ట్యాపింగ్ అంతా ఉత్తి ట్రాష్ అని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశామని మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు చెప్పిన విషయాన్ని రిపోర్టర్లు ప్రశ్నించగా.. ఆయన ఫైర్ అయ్యారు. ‘‘వాడెవడయ్యా రాధా కిషన్‌రావు. రాష్ట్రంలో వంద మంది డీసీపీలు ఉంటరు. ఎవడో ఒక్కని గురించి అడిగితే నాకేం తెలుస్తది. అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏందయ్యా? మీకో పిచ్చి పట్టుకుంది. ముఖ్యమంత్రికి, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధం ఉంటదా? ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్ ఫ్రమ్ ది ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్. వాడు ఎట్ల రిపోర్టు పట్టుకొచ్చిండో మాకేం తెలుస్తది.’’ అని సమాధానం ఇచ్చారు.
బీఆర్‌ఎస్‌గానే ఉంటాం
హైదరాబాద్‌ను యూటీ చేసే అంశంపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, హైదరాబాద్‌ను యూటీ కానిచ్చేది లేదని కేసీఆర్ అన్నారు. తిట్లు ఆపుదాం అని రేవంత్ చేసిన ప్రతిపాదనపై స్పందిస్తూ.. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఆయన ప్రతిపాదన ఉందన్నారు. జాతీయ రాజకీయాల్లో తన ప్రస్థానం కొనసాగుతుందని, బీఆర్‌ఎస్‌ను తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చే ప్రసక్తే లేదన్నారు. మోదీ వచ్చాక రాజకీయాల్లో సన్ ఫ్లవర్ గ్యాంగ్ తయారయ్యిందని
పవర్ ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లిపోతున్నారని, వాళ్లతో నష్టమేమీ లేదని అన్నారు. తమ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి పనులు, పైరవీల కోసం వెళ్తున్నారని కేసీఆర్ అన్నారు. పవర్‌లో లేనంత మాత్రాన పార్టీలు లేకుండా పోవని ఆయన వ్యాఖ్యానించారు. పదేండ్లు అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ ఖతం కాలేదని, గతంలో టీడీపీ కూడా ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.
30 మంది పార్టీలోకి వస్తామంటున్నరు..
బీజేపీలోకి రేవంత్ జంప్ కొడుతడు అని కాంగ్రెస్ నేతల్లో అనుమానం ఉందని కేసీఆర్ ఆరోపించారు. రేవంత్ మీద ఉన్న కేసులు కొలిక్కి వస్తున్నాయని, ఓటుకు నోటు కేసులో ఆయన రెడ్ హ్యాండెడ్‌గా దొరికిండని, అది భయంకరమైన కేసు అని, దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి రేవంత్ బీజేపీలోకి జంప్ కొడ్తడన్న అనుమానాలు ఉన్నాయన్నారు.
‘‘నన్నెవరూ డైరెక్ట్‌గా కన్సల్ట్ చేయలేదు. కానీ, మా పార్టీలో ఉన్న ముఖ్యులను, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓ వర్గమంతా కన్సల్ట్ చేస్తున్నరు. మేం 26 నుంచి 30 మంది ఎమ్మెల్యేలం ఉన్నాం.. అందరం కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేద్దాం అని అడుగుతున్నరు. రేవంత్‌రెడ్డి అన్నట్టు ఇటు నుంచి అటు పోతరో, అటు నుంచి ఇటు వస్తరో చూద్దాం” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
నన్ను బోనులో ఎందుకేస్తరు..?
బీఆర్‌ఎస్ పార్టీ వాళ్లు తనను టైగర్, పులి అని పిలుస్తారని కేసీఆర్ తెలిపారు. పులిని బోన్‌లో వేస్తానని రేవంత్‌రెడ్డి అనడంపై ఆయన మండిపడ్డారు. ‘‘పులిని బోన్‌లో వేస్తాం.. చర్లపల్లి జైల్లో వేస్తాం.. అని నా గురించి దుర్మార్గంగా మాట్లాడుతున్నడు. ఎందుకేస్తరు బోన్‌లో నన్ను? నేను చేసిన తప్పేంది? రాష్ట్ర తలసరి ఆదాయాన్ని, జీఎస్‌డీపీని పెంచుడు నేను చేసిన తప్పా? తెలంగాణను దేశంలో నంబర్ వన్ చేసుడు తప్పా? అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రంగా చేయడం తప్పా? ఎక్కడ ఎవడు దిక్కులేక, అసలు గతిలేక
ఇంకెక్కడి తెలంగాణ అని ఎక్కడోడు అక్కడ పండుకున్న టైమ్‌లో, నేను ఒక్కన్ని ఒంటరిగా బయల్దేరి, అనేక అవమానాలు భరించి, 14 ఏండ్లు అవిశ్రాంతంగా పోరాడి, జాతికి విముక్తి కల్పించిన. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన వ్యక్తిని నేను. నన్ను తిడుతుంటే తెలంగాణ ప్రజలకు బాధ కలుగదా?”అని కేసీఆర్ అన్నారు.