- షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి: హరీశ్‌రావు
మహబూబాబాద్/తొర్రూరు, వెలుగు: రాష్ట్రంలో రైతులందరికీ షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ వెంటనే వర్తింపచేయాలని సిద్దిపేట బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్ రావు కోరారు. లేదంటే దసరా తర్వాత ఢిల్లీలో రాహుల్‌గాంధీ ఇంటి ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో నిర్వహించిన రైతు మహా ధర్నాలో హరీశ్ మాట్లాడారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టడం కోసం షరతులను పెట్టాడన్నారు.
వరంగల్ డిక్లరేషన్ సభలో ఆనాడు కాంగ్రెస్‌నేత రాహుల్ గాంధీ ఎదుట కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను వెల్లడించిందన్నారు. అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా రుణమాఫీ చేయడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత ప్రజలకు ఆయన మొనగాడు కాదు మోసగాడని అర్థమైందన్నారు. దసరా తర్వాత రుణమాఫీ అమలు కాకుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000, రైతు కూలీలకు రూ.12,000, పోడు పట్టాల పంపిణీ ఏమైందన్నారు. 2013 యాక్ట్ ప్రకారం మూసీ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ అయ్యేంతవరకు పోరాటాలు కొనసాగిస్తానని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కార్యక్రమంలో సత్యవతి రాథోడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనా చారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.