ఆదిలాబాద్​ జిల్లాలో పదికి పది స్థానాల్లో బీఆర్ఎస్​ గెలుస్తాం : హరీశ్​రావు

మంచిర్యాల, వెలుగు:  ఎవరెన్ని జిమిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో పదికి పది స్థానాల్లో బీఆర్ఎస్​గెలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్​రావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావుతో కలిసి హాజీపూర్​మండలం దొనబండ స్టేజ్​ దగ్గర పడ్తన్​పల్లి లిఫ్ట్​ ఇరిగేషన్​స్కీమ్​కు శంకుస్థాపన చేశారు. చెన్నూర్​లో నూతనంగా నిర్మించిన 50 పడకల హాస్పిటల్ ను ఎమ్మెల్యే బాల్క సుమన్​తో కలిసి ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. 

ఈ సందర్భంగా హాజీపూర్​లో బహిరంగ సభలో, చెన్నూర్​లో రోడ్ ​షోలో మాట్లాడారు. రూ.85 కోట్లతో ఒక టీఎంసీ కెపాసిటీతో నిర్మించనున్న పడ్తన్​పల్లి లిఫ్ట్​తో కడెం చివరి ఆయకట్టు కూడా సస్యశ్యామలం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా హాజీపూర్, లక్సెట్టిపేట మండలాల్లో రెండు పంటలకు నీటి కొరత ఉండదన్నారు. 30 ఏండ్ల కిందట ఎన్టీఆర్, ఆ తర్వాత వైఎస్సార్​ మంచిర్యాలను జిల్లాగా చేస్తామని మాట తప్పారని, బీఆర్ఎస్ ​ప్రభుత్వం వచ్చాక జిల్లా ఏర్పాటు చేశామని అన్నారు. తాను కూడా హాజీపూర్​అల్లుడినేనని, మంచిర్యాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మెడికల్ ​కాలేజీ, నర్సింగ్ ​కాలేజీలను హాజీపూర్​లోనే పెడుతున్నామని తెలిపారు.

ప్రజల మనిషి దివాకర్​రావు..

24 గంటలు ప్రజల మధ్య ఉండే వ్యక్తి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు అని, ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ వచ్చి ఆదుకుంటారని హరీశ్​ప్రశంసించారు. దివాకర్​రావు ఎమ్మెల్యేగా ఉండబట్టే మంచిర్యాల ప్రశాంతంగా ఉందన్నారు. హైదరాబాద్​లో బ్యాంకులు లూటీ చేసిన వాళ్లు, పేకాట క్లబ్బులు నడిపినవాళ్లు, గుండాలు మంచిర్యాలకు వస్తున్నారని, అలాంటి వాళ్లను గెలిపిస్తే 
ఆగమవుతామని హెచ్చరించారు.

పంటలు మునగకుండా చూస్తాం.. 

చెన్నూర్ ​నియోజకవర్గంలో గోదావరికి వరదలు వచ్చినా పంటలు మునగకుండా ప్లాన్ చేసే బాధ్యత తమదని హరీశ్​రావు హామీ ఇచ్చారు. గోదావరి, ప్రాణహిత ఒడ్డున కరకట్టలు కట్టి పంటలను కాపాడుతామన్నారు. ఎమ్మెల్యే సుమన్ అంటే సీఎం, కేటీఆర్, మంత్రులకు అందరికీ ఎంతో ప్రేమ అన్నారు. ఉద్యమకారుడు కాబట్టే తమ చెయ్యి పట్టి పని చేయించుకుంటున్నాడని చెప్పారు. చెన్నూరు రెవెన్యూ డివిజన్ సుమన్ పట్టుదల వల్లే అయ్యిందన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే సుమన్​ను మళ్లీ బంపర్ ​మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో ఎంపీ బి.వెంకటేశ్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.