ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ప్రైవేటు దీటుగా సర్కార్ బడులు 

మెట్ పల్లి, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. బుధవారం మెట్ పల్లి మండలం కోనరావుపేట పట్టణంలో కొత్త స్కూల్స్ బిల్డింగ్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో బల్దియా చైర్ పర్సన్ సుజాత, మర్కజీ ఇంతేజామి కమిటీ ప్రెసిడెంట్ ఖుతుబొద్దిన్ పాషా, ఎస్ఎంసీ చైర్మన్ తోఫిక్, వైస్ చైర్మన్ మెహెర్ జహాన్, షేక్ సదఖ్, ఫరూక్ అలీ బెగ్, ఎండీ జావీద్ పాల్గొన్నారు.


మోసాలు కప్పిపుచ్చుకునేందుకే దీక్ష
ఆర్టీసీ మాజీ చైర్మన్‌‌‌‌ సత్యనారాయణ

గోదావరిఖని, వెలుగు: తాను చేసిన మోసాలు, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌ సింగరేణి ప్రైవేటీకరణ అంటూ పోరు దీక్ష చేశారని ఆర్టీసీ మాజీ చైర్మన్‌‌‌‌ సోమారపు సత్యనారాయణ విమర్శించారు. బుధవారం గోదావరిఖని శివాజీనగర్‌‌‌‌లోని ఆఫీస్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. కార్మికులను తప్పుదోవ పట్టించేందుకే బొగ్గు గనుల ప్రైవేటీకరణ వాదాన్ని తెరమీదకు తీసుకువచ్చారన్నారు. కాంగ్రెస్ హయాంలో బొగ్గు బ్లాకుల కేటాయింపులపై అవకతవకలు జరిగాయని, ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ ప్రకారం బొగ్గు బ్లాకులను వేలం ద్వారా మాత్రమే కేటాయిస్తారని పేర్కొన్నారు. సింగరేణిని  ప్రైవేటీకరించే ప్రసక్తే లేదన్నారు.  ఎమ్మెల్యే‌‌కు చిత్తశుద్ధి ఉంటే ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి చెల్లించాలన్నారు. సమావేశంలో లీడర్లు వి.రాంచందర్, ఎస్.లావణ్య, అరుణ్ కుమార్ పాల్గొన్నారు. 

ఎంపీ ఇంటి ముందు బీజేపీ లీడర్లు ధర్నా చేయాలి : కాంగ్రెస్​ నేత కృష్ణారావు 

కోరుట్ల,వెలుగు: బీజేపీ లీడర్లు ధర్నాలు చేయాల్సింది కలెక్టరేట్​ల ముందు కాదని, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్ ద్వారా హామీ ఇచ్చి రైతులను మోసం చేసిన ఎంపీ  అరవింద్​ ఇంటి ముందని కాంగ్రెస్​ సీనియర్​ నేత జువ్వాడి కృష్ణారావు అన్నారు. బుధవారం కోరుట్లలో ఆయన మాట్లాడుతూ 2019లో ఎన్నికల్లో అరవింద్​హామీ ఇచ్చి మోసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేయాలంటూ బీజేపీ లీడర్లు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. గతంలో కేంద్రంలో , రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు దేశవ్యాప్తంగా రైతులకు ఏకకాలంలో రుణ మాఫీ చేసిందన్నారు. ఇపుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు , పెట్టుబడిదారులకు వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందని, పేద రైతులకు మాత్రం రూపాయి కూడా మాఫీ చేయలేదని 
ఆరోపించారు.


ఘనంగా కాంగ్రెస్ ​ఆవిర్భావ దినోత్సవం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో లీడర్లు బుధవారం కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  కరీంనగర్​డీసీసీ ఆఫీస్ లో కాంగ్రెస్​జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. సిటీ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, సత్య ప్రసన్న రెడ్డి, అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లిలో మాజీ ఎమ్మల్యే విజయరమణారావు స్థానిక గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కేక్​కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కోరుట్ల కాంగ్రెస్ లీడర్లు జెండా ఎగురవేసి కేక్​కట్​చేశారు. పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు గంగాధర్, రాజం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కథలాపూర్ లో మండల, బ్లాక్​ అధ్యక్షులు నాగరాజు, అజీమ్, ఎంపీటీసీ శిరీష, హరిప్రసాద్ తదితరులు పార్టీ జెండా ఎగురవేశారు. సుల్తానాబాద్ లో పీసీసీ ఉపాధ్యక్షుడు సీహెచ్. విజయ రమణారావు పార్టీ పతకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. లీడర్లు ప్రకాశ్​రావు, దామోదర్ రావు, వరప్రసాద్, సతీశ్, అబ్బయ్య గౌడ్ పాల్గొన్నారు. కొత్తపల్లిలో పట్టణాధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. లీడర్లు హనుమంతరెడ్డి, కనకారెడ్డి, వాసు, శ్రీనివాస్, శివకుమార్, వీరేశం తదితరులు పాల్గొన్నారు. బోయినిపల్లిలో మండలాధ్యక్షుడు రమణారెడ్డి.. మాజీ జడ్పీటీసీ లక్ష్మీపతి, ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, గంగిపెల్లి లచ్చయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. జమ్మికుంటలో యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ సజ్జు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మాజీ పట్టణాధ్యక్షుడు సదయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రవి, జమ్మికుంట పట్టణ ఉపాధ్యక్షుడు బుర్ర కుమార్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.  - వెలుగు, నెట్​వర్క్​


‘కార్మికుల శ్రమను దోచుకుంటున్నరు’

గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లలో పనిచేస్తున్న ఓవర్‌‌‌‌ బర్డెన్‌‌‌‌(ఓబీ‒మట్టి తొలగింపు)కార్మికులకు న్యాయమైన వేతనాలు చెల్లించాలని బీజేపీ కార్మిక నాయకుడు కౌశిక హరి డిమాండ్ చేశారు. బుధవారం గోదావరిఖనిలో ఓబీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓబీ కార్మికుల శ్రమను దోచుకుంటుండడం అమానుషమన్నారు. ఐదు సంవత్సరాలుగా వేతనాలు పెరుగక ఓబీ కార్మికులు ఆర్థికంగా తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. సమావేశంలో సర్పంచ్ లావణ్య, బీజేపీ లీడర్లు రవీందర్ రెడ్డి, రామన్న, రాజు, విజయ్‌‌‌‌,  తదితరులు పాల్గొన్నారు.

సైబర్ నేరస్తుల్లా వ్యవహరిస్తున్నరు

హుజూరాబాద్​ వెలుగు: అమాయకుల అకౌంట్ల నుంచి డబ్బులు కొల్లగొట్టే సైబర్ నేరస్తుల్లా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ జిల్లా అద్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను  మళ్లించడాన్ని నిరసిస్తూ బుధవారం హుజూరాబాద్​చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గంగాడి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులు ఇలా రాగానే అలా డైవర్ట్ చేయడం కేసీఆర్ ​ప్రభుత్వం అలవాటుగా మార్చుకుందన్నారు. పంచాయతీలకు నేరుగా నిధులు మంజూరు చేస్తున్న కేంద్ర నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించినందుకు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న సర్కార్ నిజ రూపం నేడు  బహిర్గతమైందన్నారు. కేసీఆర్​మాటలను నమ్ముకుని సర్పంచులు గ్రామాల్లో పనులు చేపడితే  నేడు వారి నోట్లలో మట్టి కొడుతోందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లు కరుణాకర్, సునీత, సాంబయ్య, ఎల్లారెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణ, సంపత్ రావు పాల్గొన్నారు. 

రూ.4886 కోట్లతో  పొటెన్షియల్ లింక్డ్ ప్లాన్ : కలెక్టర్ కర్ణన్ 

కరీంనగర్ టౌన్, వెలుగు:  రూ.4,886.92 కోట్లతో జిల్లా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ తయారు చేసినట్లు కలెక్టర్ కర్ణన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో నిర్వహించిన  సమావేశంలో నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్షిక ప్రణాళికలో క్రాప్ లోన్లకు రూ.2819.80 కోట్లు, టర్మ్ లోన్లకు రూ.1507.28 కోట్లు, ఎంఎస్ఎంఈకు రూ.1063.78 కోట్లు ప్రాధాన్యత రంగానికి రూ.243.76 కోట్లు  మొత్తం రూ.4886.92 కోట్లతో ప్రణాళిక రూపొందించామన్నారు. దీని ఆధారంగా జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్  కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్, జడ్పీ సీఈఓ ప్రియాంక, నాబార్డ్ డీడీఎం ఆనంత్, ఎల్డీఎం ఆంజనేయులు పాల్గొన్నారు.

‘కేంద్ర నిధులు  మళ్లించడం సిగ్గుచేటు’

గంగాధర, వెలుగు: కేంద్ర ప్రభుత్వం జీపీలకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లించుకోవడం సిగ్గుచేటని చొప్పదండి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పెరుక శ్రావణ్​కుమార్ విమర్శించారు. బుధవారం మధురానగర్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నుంచి నిధులు రావడం లేదని దుష్ప్రచారం చేసిన టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పుడేం మాట్లాడతారని నిలదీశారు. అధికార పార్టీకి చెందిన సర్పంచులే రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అబద్ధపు హామీలతో పబ్బం గడుపుతోందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

అక్రమాలు చేసి సెస్ ఎన్నికల్లో గెలిచారు
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమాకాంత్

రాజన్న సిరిసిల్ల,వెలుగు: సెస్ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడి గెలిచిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రమాకాంత్ రావు ఆరోపించారు. బుధవారం సిరిసిల్లలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  సెస్ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అధికార పార్టీకి అధికారులు సపోర్ట్ చేశారన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఆఫీసర్లు  దగ్గరుండి బీఆర్ఎస్ డైరెక్టర్ లను గెలిపించారని ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రంలో వేములవాడ రూరల్, చందుర్తి మండలాల డైరెక్టర్ రెండు సార్లు గెలిచారని ప్రకటించిన అధికారులు తర్వాత బీఆర్ఎస్ నాయకులు గెలిచారని ప్రకటించారన్నారు. కౌంటింగ్ కేంద్రంలో బాక్స్ లు ఓపెన్ చేసి ఉన్నాయని ఎంత చెప్పినా పట్టించుకోలేదని రమాకాంత్ ఆరోపించారు.