ఖమ్మం, వెలుగు: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జనాలు రాక అట్టర్ ప్లాప్ అవుతుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పై కాంగ్రెస్నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఎద్దేవా చేశారు. ఆదివారం పార్టీ జిల్లా ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ సభకు జనాలు రాక వెలవెలబోయిందన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ పార్టీకి నష్టం లేదన్నారు. భట్టి విక్రమార్క చేసిన పాదయాత్రను బీఆర్ఎస్అడ్డుకుంటే, మేం కుట్రలు చేసేవాళ్లమే అయితే పాదయాత్ర విజయవంతంగా చేసేవారా? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ బహిరంగ సభ పెట్టుకునేందుకు ఎంత హక్కు ఉందో ఇతర పార్టీలు సభలు పెట్టుకునేందుకు అంతే హక్కు ఉందని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. అసత్య ప్రచారాలకు నిలువెత్తు రూపం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత ఖమ్మంలో చంద్రబాబు సభను తామేమీ అడ్డుకోలేదన్నారు. జనాలు స్వచ్ఛందంగా వెళ్లాలి అనుకుంటే ఏ అడ్డంకులనైనా అధిగమించిపోతారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, జిల్లా రైతు సమన్వయ అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర్లు, జిల్లా యువజన అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య, తెలంగాణ ఉద్యమకారుడు ఉప్పల వెంకటరమణ పాల్గొన్నారు.