జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నుంచి బీఆర్ఎస్ ​ఔట్..

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నుంచి బీఆర్ఎస్ ​ఔట్..
  • 9 ఏండ్ల తర్వాత సున్నాకు పడిపోయిన పార్టీ ప్రాతినిధ్యం​
  • సంఖ్యాబలం లేకపోవడంతో వేసిన రెండు నామినేషన్లు విత్ డ్రా
  • ఎంఐఎం నుంచి 8 మంది, కాంగ్రెస్​ నుంచి ఏడుగురు ఏకగ్రీవం  
  • బల్దియా నిర్ణయాల్లో స్టాండింగ్​ కమిటీదే కీలకపాత్ర

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​హైదరాబాద్​మున్సిపల్​కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ నుంచి బీఆర్ఎస్ ఔట్ అయింది. 9 ఏండ్లుగా స్టాండింగ్ కమిటీ లో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన ఆ పార్టీకి.. ఇప్పుడు అందులో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్​నుంచి 99 మంది, ఎంఐఎం నుంచి 44 మంది గెలుపొందారు. అప్పట్లో బీఆర్ఎస్​కు ఫుల్ మెజారిటీ ఉన్నప్పటికీ, ఎంఐఎంతో కలిసి నడిచింది. దీంతో 2016–2020 వరకు స్టాండింగ్ కమిటీలో బీఆర్ఎస్​నుంచి 9 మంది, ఎంఐఎం నుంచి ఆరుగురు సభ్యులు కొనసాగారు. 

కానీ 2020 గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్​సంఖ్య తగ్గడంతో ఎంఐఎం మద్దతుతో మేయర్ స్థానాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి స్టాండింగ్​కమిటీలో బీఆర్ఎస్ నుంచి 8 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు సభ్యులు కొనసాగుతూ వచ్చారు. అయితే 2023 డిసెంబర్​లో రాష్ట్రంలో కాంగ్రెస్​అధికారంలోకి రావడంతో మేయర్, డిప్యూటీ మేయర్ సహా కొందరు కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరారు. అలాగే ఎంఐఎం కూడా కాంగ్రెస్ కు సపోర్టు చేస్తున్నది. 

దీంతో తాజాగా జరిగిన స్టాండింగ్​కమిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు  సంఖ్యాబలం లేకపోవడంతో వేసిన రెండు నామినేషన్లను విత్ డ్రా చేసుకుంది. మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ మెంబర్లకు గాను ఎంఐఎం నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7, బీఆర్ఎస్​నుంచి 2 నామినేషన్లు వచ్చాయి. బీఆర్ఎస్​కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి గురువారం నామినేషన్ విత్ డ్రా చేసుకోగా, శుక్రవారం మరో బీఆర్ఎస్​కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఎంఐఎం నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి ఏడుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. కాగా, బీజేపీ పోటీకి ముందు నుంచే దూరంగా ఉంది.  

పోటీ నుంచి తప్పుకున్న బీఆర్ఎస్..  

నాలుగేండ్ల కింద జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్​నుంచి 55 మంది, బీజేపీ 48 మంది, ఎంఐఎం 44 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు చొప్పున కార్పొరేటర్లుగా గెలిచారు. ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకు లింగోజీగూడ కార్పొరేటర్ మరణించడంతో అక్కడ జరిగిన బై ఎలెక్షన్ లో కాంగ్రెస్​గెలిచింది. ఆ తర్వాత బీజేపీ కార్పొరేటర్ ఒకరు, ఎంఐఎం కార్పొరేటర్ మరొకరు మరణించారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి ముగ్గురు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాక మేయర్, డిప్యూటీ మేయర్ సహా ఇంకొందరు ఆ పార్టీలో చేరారు.

ప్రస్తుతం కాంగ్రెస్​ లో 24 మంది, ఎంఐఎంలో 41 మంది, బీజేపీలో 39 మంది, బీఆర్ఎస్ లో 42 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఏకగ్రీవం కావాలంటే 74 మంది కార్పొరేటర్లు ఏకపక్షంగా ఉండాలి. ఒక్క సభ్యుడు 15 మందికి ఓటు వేసే అవకాశముంది. ప్రస్తుతం కాంగ్రెస్​కు ఎంఐఎం సపోర్టు చేయడంతో 65 మంది ఏకపక్షమయ్యారు. బీజేపీ పోటీ నుంచి తప్పుకోవడంతో బీఆర్ఎస్​ కార్పొరేటర్లు పోటీ చేసినప్పటికీ, ఒక్కొక్కరికి గరిష్టంగా 42 ఓట్లు మాత్రమే వచ్చేవి. కానీ కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులకు ఒక్కొక్కరికి 65 ఓట్లు వచ్చేవి. ఇలా ఎన్నికలు జరిగినా  తాము గెలిచే చాన్స్ లేకపోవడంతో బీఆర్ఎస్​పోటీ నుంచి తప్పుకుంది.  

స్టాండింగ్ కమిటీ కీలకం..

 జీహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీ పాత్ర ఎంతో కీలకమైంది. ఈ కమిటీకి మేయర్ అధ్యక్షత వ్యవహరిస్తారు. ఇది ప్రతి వారం సమావేశమై రెగ్యులర్ గా జరగాల్సిన పనులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రూ.2 కోట్ల వరకు విలువైన పనులకు అనుమతులు ఇచ్చే అధికారం కమిషనర్ కు ఉంది. రూ.5 కోట్ల వరకు విలువైన పనులు చేయాలంటే స్టాండింగ్ కమిటీ ఆమోదం తప్పనిసరి. అంతకుమించిన పనుల కోసం ప్రభుత్వానికి స్టాండింగ్ ​కమిటీ సిఫార్సు చేస్తుంది. 

కమిటీ సభ్యులు వీళ్లే.. 

స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ నుంచి బానోత్ సుజాత, బాబాఫసియొద్దీన్, బురుగడ్డ పుష్ప,​ బొంతు శ్రీదేవి, మహాలక్ష్మీ రామన్ గౌడ్, సీఎన్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్ ఉన్నారు. ఇక ఎంఐఎం నుంచి అబ్దుల్ వాహబ్, అయేషా బేగం, పర్వీన్ సుల్తానా, బతా జబీన్, మహ్మద్ సలీం, సమీనా బేగం, సయ్యద్ మినాజుద్దీన్, మహమ్మద్ గౌసుద్దీన్ ఉన్నారు.