రేషన్​ కార్డులు ఇస్తుంటే బీఆర్ఎస్సోళ్ల కండ్లు మండుతున్నయ్

రేషన్​ కార్డులు ఇస్తుంటే బీఆర్ఎస్సోళ్ల కండ్లు మండుతున్నయ్
  • 15 రోజుల తర్వాత ఏ ఒక్కరూ నోరు తెరవకుండా చేస్తం
  • బీఆర్ఎస్​పాలనలో ఒక్క ఫ్యామిలీకైనా రేషన్​కార్డు ఇచ్చారా?
  • ఆదిబట్లలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఇబ్రహీంపట్నం, వెలుగు:  రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు కొత్తగా రేషన్​కార్డులు ఇస్తుంటే బీఆర్ఎస్​నేతలు, ప్రజాప్రతినిధులు ఓర్వలేకపోతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి ఒక్క కుటుంబానికి కూడా రేషన్​కార్డు ఇవ్వని వారి కండ్లు మండుతున్నాయని, ఫ్రస్ట్రేషన్​లో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. 

గురువారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీలో రూ.25 కోట్ల నిధులతో నిర్మించనున్న రోడ్డు పనులకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రోడ్డు డెవలప్​మెంట్​కార్పొరేషన్​ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, మున్సిపల్​చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. క్యాబినెట్ లో 40 లక్షల వరకు రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 15 రోజుల తర్వాత ప్రతిపక్ష నేతలెవ్వరూ తెరవరని, అర్హులైన పేదలు దరఖాస్తు చేసిన క్షణాల్లో రేషన్ కార్డు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఇబ్రహీంపట్నం రుణం తీర్చుకుంటా..

ప్రతి కనెక్టివిటీ రోడ్డును డబుల్​లైన్​చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మన్నెగూడ నుంచి ఒవైసీ హాస్పిటల్ వరకు నాలుగు లైన్లు, పెద్దఅంబర్ పేట నుంచి నాగార్జున సాగర్ వరకు పెద్ద రోడ్డు నిర్మించాలని నిర్ణయించామన్నారు. 

దశల వారీగా అభివృద్ధి చేసి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ స్రవంతి, గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఆర్అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్, అధికారులు పాల్గొన్నారు.