మెట్ పల్లి, వెలుగు : పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన కోరుట్ల బీజేపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అర్వింద్ ను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి మండలం మేడిపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేడిపల్లి స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఎంపీ అర్వింద్.. బీజేపీ కార్యకర్తలతో కలిసి పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్తుండగా అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఎంపీగా గెలిపిస్తే తమ గ్రామానికి చేసిన అభివృద్ధి ఏమిటని వారు ఆయనను నిలదీశారు. ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఇక్కడికి ఎలా వస్తావని, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలతో పోలింగ్ కేంద్రంలోకి ఎలా వెళ్తారని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. స్పందించిన పోలీసులు.. ఇరు వర్గాలను సముదాయించి అక్కడి నుంచి పంపించారు.