బెల్లంపల్లి, వెలుగు: నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని నిరుద్యోగ చైతన్య యాత్ర కన్వీనర్, ప్రొఫెసర్ డాక్టర్ రియాజ్ పిలుపునిచ్చారు. వారం రోజుల క్రితం ప్రారంభించిన నిరుద్యోగ చైతన్య యాత్ర మంగళవారం సాయంత్రం బెల్లంపల్లి పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా కాంటా చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి రియాజ్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే విద్యారంగానికి అతి తక్కువ మొత్తంలో నిధులు వెచ్చించిందన్నారు.
2014 ఎన్నికల మేనిఫెస్టోలో కేజీ టు పీజీ ఉచిత విద్యను ప్రకటించిన కేసీఆర్.. తొమ్మిదేండ్లలో కొత్తగా ఒక్క తరగతి గదిని కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని, ఉద్యోగాలు రాక 3,600 మందికి పైగా యువకులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివాదాలు, అవినీతి లేకుండా కనీసం ఒక్క పరీక్ష కూడా నిర్వహించలేకపోయారని, పరిపాలన పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. చెన్నూర్, ఆసిఫాబాద్లోనూ యాత్ర సాగింది.