
- ఆరు గ్యారంటీల అమలుకు పైసల్లేవా.. మరి వేల కోట్ల టెండర్లు ఎట్లిస్తున్నరు?: కేటీఆర్
- మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఉంటయ్.. కానీ తులం బంగారానికి లేవా?
- కక్షసాధింపు రాజకీయాలతో రాష్ట్రం ఆగం
- సంక్షేమం నుంచి సంక్షోభం వైపు పోతున్నది
- రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలు హామీలిచ్చి, ఇప్పుడు తమపై ఏడుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలుకు పైసల్లేవని చెబుతున్న ప్రభుత్వం.. వేల కోట్ల టెండర్లు ఎట్లిస్తున్నదని ప్రశ్నించారు. ‘‘ఉద్యోగుల డీఏకు పైసల్లేవని, ఆరు గ్యారంటీల అమలుకు పైసల్లేవని, తులం బంగారం ఇచ్చేందుకు పైసల్లేవని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కానీ హెచ్ఎండీఏలో రూ.20 వేల కోట్లతో టెండర్లు ఇచ్చారు. జీహెచ్ఎంసీలో రూ.7 వేల కోట్లతో, వాటర్ వర్క్స్‌లో రూ.14 వేల కోట్లతో, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌లో రూ.4,400 కోట్లతో టెండర్లు ఇచ్చారు. మరి వీటికి పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి?” అని ప్రశ్నించారు. లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణకు డబ్బులు ఉంటాయట.. కానీ ఆరు గ్యారంటీల అమలుకు, తులం బంగారానికి పైసల్లేవాట? అని ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డే రైతు బంధును ఆపారని అన్నారు. ‘‘వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి, అఫిడవిట్లు రాసి, బాండ్ పేపర్లను దేవుళ్ల ముందటపెట్టింది ఎవరు? వంద రోజుల్లోనే తులం బంగారం ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదు? ప్రజలు ఇన్ని రోజులు కాంగ్రెస్ నేతలు గోల్డ్ అనుకుంటే.. ఇప్పుడు రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోయింది. లంకె బిందెలు దొరికేదాకా ప్రజలు హామీల అమలు కోసం వేచి చూడాలా?” అని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి అడిగితే.. ‘తెలియదు.. గుర్తులేదు.. మరిచిపోయా’ అనే సమాధానం వస్తోందని అన్నారు.
తెలంగాణ ఇప్పటికీ దిగ్గజ రాష్ట్రమే..
ఏ ఊరిలోనైనా వందశాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే, తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ సవాల్ చేశారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కోడంగల్‌లో గానీ, నా సెగ్మెంట్ సిరిసిల్లలో గానీ.. ఏ ఊరికైనా పోదాం. డిసెంబర్ 7న ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, రూ.2 లక్షల రుణమాఫీ మీద 9వ తారీఖున సంతకం పెడతానని ఆనాడు రేవంత్ చెప్పారు. మరి రుణమాఫీ పూర్తయిందా? ఒక్క ఊరిలోనైనా రైతులందరికీ రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంట” అని సవాల్ విసిరారు. రాష్ట్రం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ‘‘ఎవరు నమ్ముతలేరు.. అప్పు పుడుతలేదు.. రాష్ట్రం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి బయట చెప్తున్నారు. కానీ సభలోకి వచ్చి రూ.1.58 లక్షల కోట్ల అప్పు చేసినట్టు చెప్తున్నారు. బయట మాట్లాడుతున్న రాము కరెక్టా? సభలో మాట్లాడుతున్న రెమో కరెక్టా?” అని విమర్శించారు. తెలంగాణ ఇప్పటికీ దిగ్గజ రాష్ర్టమేనని, దివాలా రాష్ట్రం కాదని చెప్పారు. సీఎంకు అసహనం పనికిరాదని.. ఆయనకంత ఆవేశం, నిస్పృహ ఎందుకో అర్థం కావడం లేదన్నారు. సీఎంలో ఒక అపరిచితుడు దాగి ఉన్నాడని కామెంట్ చేశారు.
అధికారం శాశ్వతం కాదు..
అధికారం శాశ్వతం కాదని కేటీఆర్ అన్నారు. ‘‘సీఎం ఇంటి మీదికి డ్రోన్ పంపిస్తే ఆయన ఊరుకుంటాడా? ఆయన భార్యాపిల్లల ఫొటోలను ఇష్టం వచ్చినట్టు తీస్తామంటే ఊరుకుంటాడా? ఆయనకే భార్యాపిల్లలు ఉన్నారా.. వేరే వాళ్లకు లేరా? లేని రంకులు అంటగట్టి ఇష్టమున్నట్టు మాట్లాడినప్పుడు... నీతులు గుర్తుకురాలేదా? మా ఇంట్లోని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడారు. సీఎం ఎవరున్నా.. ఏం చేసినా మాకు ఫరక్ పడదు. పదవి, అధికారం శాశ్వతం అని సీఎం అనుకుంటున్నారు. కానీ అవేవీ శాశ్వతం కాదు. సీఎంకు అపరిమిత అధికారాలు ఉండవు. ఆయన ఎవరినీ జైలుకు పంపలేరు. కేవలం కోర్టులు మాత్రమే ఆ పని చేయగలవు” అని అన్నారు. తెలంగాణ జాతిపిత ముమ్మాటికీ కేసీఆరేనని, తెలంగాణ బూతుపిత రేవంత్ రెడ్డి అని విమర్శించారు. పాత కాంగ్రెస్ నేతలను ఖతం చేసి పదవి లాక్కున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని కామెంట్ చేశారు. విఫల పాలనకు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారని అన్నారు. అప్పుల్లో, అబద్ధాల్లో, క్రైం రేట్‌లో, అన్నదాతలు, నేతన్నల ఆత్మహత్యల్లో తెలంగాణ ఈజ్ రైజింగ్ అంటూ విమర్శించారు.
పదేండ్లుగా తెలంగాణకు కేంద్రం దగా..
పదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఎలా దగా చేస్తుందో బడ్జెట్‌లో చెప్పి ఉంటే బాగుండేదని కేటీఆర్ అన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్టు వింటేనే పైసలు ఇస్తామని కేంద్రం చెప్పడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. విభజన చట్టంలోని అనేక హామీలను అమలు చేయలేదు. కేంద్ర వైఖరిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరసన తెలపకపోవడం సరికాదు. పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ ఒక్క సీటు గెలువలేదు. గుండు సున్నా సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చినా.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నానే వచ్చింది. కేంద్రంతో కోట్లాడకపోతే నిధులు రావు. తెలంగాణ కోసం మేం కలిసి వస్తాం. కేంద్రం పెట్టిన 41 లక్షల కోట్ల బడ్జెట్‌లో ఒక్కటీ తెలంగాణకు సంబంధించిన స్కీమ్ లేదు” అని అన్నారు.
కూలేశ్వరం అనడం మంచిది కాదు..
కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని మంత్రులు అనడం రాష్ట్రానికి మంచిది కాదని కేటీఆర్ అన్నారు. ‘‘కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు. కాళేశ్వరం కూలిపోయిందని చెప్పే సీఎం.. ఆ ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తెస్తామని ఎలా చెప్తారు?” అని ప్రశ్నించారు. ‘‘ఫార్మా అంటే విషం, ఫార్మా అంటే పొల్యూషన్ అని కాంగ్రెస్ నేతలు చెబుతారు. అలాంటప్పుడు ఎవరైనా తమ గ్రామంలో ఫ్యాక్టరీ ఎందుకు పెట్టాలని కోరుకుంటారు. ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టకపోతే వాళ్లు ఎందుకు ఒప్పుకుంటారు” అని అన్నారు.
కక్షసాధింపు రాజకీయాలు సరికాదు..
కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నదని కేటీఆర్ అన్నారు. “15 నెలలుగా విపరీత ధోరణీ చూస్తున్న. కేసీఆర్ ఆనవాళ్లు ఉండొద్దు.. చెరిపేస్త, తుడిచేస్త అని పాలకులు అంటున్నారు. ఈ శపథాలే రాష్ర్టానికి శాపాలుగా మారుతున్నాయి. పాలకుడికి ఉండాల్సింది కక్ష కాదు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయండి. తప్పకుండా ప్రజలు మళ్లీ అనుగ్రహించినా ఆశ్చర్యం లేదు. కానీ, ఇదే రకంగా పోతే.. కేవలం కక్షతో, పగతో ప్రతీకారంతో తుడిచేస్తా, చెరిపేస్తా అంటే మీరే నష్టపోతారు. మాకేమీ కాదు. పేరు ప్రతిష్టలు పెంచుకోవాలంటే మాకంటే ఎక్కువ చేయాలి. అంతేకానీ, రివెంజ్ పాలిటిక్స్ ద్వారా రాష్ట్రం ఆగమైతంది. సంక్షేమం నుంచి సంక్షోభం వైపు పోతున్నది. ఇది నేనేమీ చెప్పలేదు మీరే చెప్పారు” అని అన్నారు.